పవన్‌ కళ్యాణ్‌తో పనిచేసేందుకు సిద్ధమైన చలమలశెట్టి సునీల్

Update: 2018-10-15 04:35 GMT

జనసేన లోకి వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పవన్‌ కళ్యాన్‌తో కలిసి పనిచేసందుకు ముందుకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా జనసేన లోకి రంగ ప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే ఆయన పలు సార్లు జనసేన తో కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గంలో చలమలశెట్టి సునీల్ తన పట్టును పెంచుకుంటున్నారు. గతంలో రెండు సార్లు ఓటమి చవిచూసిన ఆయన ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. జనసేన అయితేనే తనకు కలిసి వస్తుందని భావించిన సునీల్ ...2 రోజుల క్రితం విజయవాడలో పవన్ కలిసిన  మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన వైఎస్సార్ సీపీ లో చేరి తిరిగి ఆ పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా బరిలో దిగారు. 2014లో వైసీపీ తరఫున ఆయన బరిలోకి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో సునీల్ కి గట్టి దెబ్బ తగిలింది . పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం పర్యటన వల్లే సునీల్ తన సమీప ప్రత్యర్థి తోట నరసింహం పై సుమారు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందవలసి వచ్చింది. రెండు వరుస ఎన్నికలు సునీల్ ని క్రుంగ తీసినప్పటికీ జనంలో మాత్రం ఆయన సానుభూతి మరింత పెరిగిందనే చెప్పాలి. దానితోనే ఆయన తిరిగి కాకినాడ నుంచే  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సునీల్ అభిమానులు మాత్రం తామంతా ఆయనతోనే ఉంటామని అంటున్నారు. తమకు పార్టీతో సంబంధం లేదని సునీల్ ఏ పార్టీలో చేరినా తాము ఆయనకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పవన్ కళ్యాన్ ఒక క్రమ పద్దతిలో తన పార్టీని జనంలోకి తీసుకువెళుతున్నారు. టిడిపి, వైసీపీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు పార్టీని సమాయత్తం చేస్తున్నారు.  ప్రజా పోరాట యాత్ర చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నేడు ఆ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా పవన్ ఆధ్వర్యంలో జనసేన కవాతు నిర్వహించనుంది. గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పై జరగనున్న ఈ కవాతులో రెండు లక్షల మంది జన సైనికులు పాల్గొంటారని సమాచారం. చలమలశెట్టి సునీల్ కూడా తన అనుచరులతో ఈ కవాతులో పాల్గోనున్నారు. 

Similar News