ఏపీలో కాక రేపుతున్న హోదా పోరు

Update: 2018-04-16 11:57 GMT

ప్రత్యేక హోద సాధనే లక్ష్యంగా ఏపీలో చేపట్టిన బంద్.. సక్సెస్ అయింది. రాజకీయ, సామాజిక, ప్రజా, విద్యార్థీ సంఘాలన్నీ రోడ్డెక్కాయి. హోదా ఇవ్వాల్సిందే అని నినదించాయి. రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. సోమవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. 

 ధర్నాలు, రాస్తారోకోలు, మౌనప్రదర్శనలు, మానవహరాలతో ఆంధ్రప్రదేశ్  దద్దరిల్లింది. ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన ప్రదర్శలు హోరెత్తాయి. విపక్ష వైసీపీ, జనసేన, వామపక్షాలతో పాటు.. హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుతో.. 13 జిల్లాల్లో అఖిలపక్షం నాయకులు ఆందోళన నిర్వహించారు.  ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌.. ఉత్తరాంధ్రలో సక్సెస్ అయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో అఖిలపక్షం నాయకులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల మందు భైఠాయించి బస్ సర్వీసులను అడ్డుకున్నారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 

మరోవైపు హోదా నిరసనలతో విశాఖ దద్దరిల్లింది. ప్రతిపక్ష వైసీపీతో పాటు.. సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు ఉదయం నుంచే రహదారులను దిగ్భంధం చేశారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్పెషల్ స్టేటస్ కోసం తాత్కాలిక ఇబ్బందులును భరిస్తామంటూ.. స్ధానిక ప్రజలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఇటు ఏపికి ప్రత్యేక హోదా రాకపోవడానికి సీఎం చంద్రబాబు కారణమని.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. రోజుకో మాట పూటకో బాట పట్టే చంద్రబాబును నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హోదా ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరు నగరం బోసిపోగా విజయవాడ నిర్మాణుష్యంగా మారింది. ఉదయం నుంచే ప్రత్యేక సాధన సమితి నేతలు రోడ్డెక్కడంతో అమరావతిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హోదా కోసం ఎందాకైనా అంటూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అఖిలపక్షం నేతలు నిరసనలకు దిగారు. ఒంగోలు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బంద్ నేపథ్యంలో జిల్లాల్లోని విద్య, వ్యాపార స్వచ్ఛందంగా బంద్  ప్రకటించాయి. వైసీపీ, జనసేన కార్యకర్తలు జాతీయరహదారులను దిగ్భంధించారు. గుంటూరులో తలకిందులుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో నిరసనలు హోరెత్తాయి. ఉదయం నుంచే డిపోల మందు ఆందోళనచేపట్టడంతో కడప జిల్లా వ్యాప్తంగా సుమారు 850 బస్సులు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలోని డోన్ లో వామపక్ష నేతలు టైర్లు తగులబెట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. కడప బస్టాండ్ సెంటర్‌లో వైసీపీ నాయకులు క్రికెట్ ఆడారు. హోదా ఇవ్వాల్సిందే అంటూ అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు.  తిరుపతిలో వంటా వార్పు చేపట్టారు. కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. అనంతపురం గడియారం చౌరస్తాలో మోడి దిష్టిబొమ్మను తగలబెట్టడంతో పాటు శవయాత్ర నిర్వహించారు.

Similar News