విశాఖవాసులను భయపెడుతున్న ఏడాకుల చెట్లు

Update: 2017-12-25 09:59 GMT

విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పచ్చదనం కోసం ఉడా అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయ్. గాలి పీల్చాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ్. విశాఖ వాసులు గాలి పీల్చేందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ? ఆ మొక్కల నుంచి వచ్చే వాసన ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తోందా ? 

హుద్‌హుద్‌ తుఫానుతో విశాఖలో ఉన్న పచ్చదనం మొత్తం పోయింది. దీంతో విశాఖలో పచ్చదనం పెంపొందించేందుకు ఉడా అధికారులు గ్రీన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని రహదారుల్లో పెద్ద ఎత్తున ఏడాకుల చెట్లను నాటింది. ఆల్‌ స్టోనియా స్కోలరీస్‌ అనే శాస్త్రీయ నామమున్న ఏడాకుల మొక్కలను 5లక్షలకు పైగా నాటారు. ఇవి అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన ఈ మొక్కలు పూత దశకు వచ్చాయ్. ఇంతవరకు బాగానే ఉన్నా చెట్లు పూత దశకు రావడంతో విశాఖ వాసులకు కొత్తకష్టాలు మొదలయ్యాయ్. ఈ మొక్కల పూల నుంచి వచ్చే వాసనకు ఎంవీపీ కాలనీ చుక్కలు కనిపిస్తున్నాయ్. ఈ చెల్లు కింద ఎక్కువ సేపు నిలబడితే తలనొప్పి రావడం, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఏడాకుల చెట్ల నుంచి వాసన, దుష్ప్రభావాలపై ఆంధ్రా యూనివర్శిటీ బాటనీ పరిశోధకులు రీసెర్చ్‌ చేస్తున్నారు. శీతాకాలంలో మాత్రమే ఈ చెట్ల నుంచి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్లు చెబుతున్నారు. చెట్లు పుష్పించే సమయంలో ప్రూనింగ్‌ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ మొక్కలకు కొన్ని ఔషధ గుణాలు ఉండటంతోనే పీల్చలేని వాసన వస్తుందంటున్నారు. అక్టోబర్‌ నుంచి జనవరి మధ్యలో మొక్కలను ప్రూనింగ్‌ చేస్తే ప్రజలకు సమస్య ఉండదని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఏడాకుల మొక్కలపై ఉడా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు ఎలాంటి రోగాల బారిన పడకుండా సకాలంలో సమస్యకు పరిష్కారం తీసుకోవాలంటున్నారు.

Similar News