స్థానిక ఎన్నికలపై వైసీపీ క్యాడర్‌ ఆశలు.. ఊరిస్తున్న పదవులు, నామినేటెడ్ పోస్టులు

Update: 2019-11-27 05:52 GMT
జగన్

స్థానిక సమరం వైసీపీ నేతలను ఊరిస్తూనే ఉంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా నీరుగారిపోతున్నారు. సంక్రాంతి తర్వాతే లోకల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది.

ఏపీలో స్థానిక ఎన్నికలపై వైసీపీ క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నీటిపారుదల సంఘాలు పదవీకాలం ఎప్పుడో ముగిసింది. అయినా ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల జరుపుతామని సీఎం జగన్ ప్రకటించినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడిన వారు రూరల్ ప్రాంతాల్లోని నాయకులకు ఎన్నికల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వైసీపీ రూరల్‌లో బలంగా ఉన్నప్పటికీ అర్బన్‌లో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకులే తీసుకుని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని జగన్ సూచించారు. రూరల్, అర్బన్‌లలో పార్టీ బలోపేతంతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకమని భావిస్తున్నారు. ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకుని ఆపరేషన్ ఆకర్ష్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది.

ఇటు వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతలను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలని జగన్ సూచించారు. అసమ్మతి వర్గం లేకుండా ఎవరికి సీటు కేటాయించినా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం , అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. మొత్తానికి సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆలోపు పార్టీ బలాన్ని మరింత పెంచుకునే వ్యూహాలు పన్నుతున్నారు. 

Tags:    

Similar News