శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. నర్సు హేమలత ఆసుపత్రిలో నర్సులగదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హేమలత ఆసుపత్రి పైఅంతస్తుల్లో విధులు నిర్వహించేది. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు విధులకు హాజరైంది. వార్డులో ఉన్న రోగులకు సేవలందిస్తున్న ఆమె సుమారు గంట సమయం పైగా వార్డులో కనిపించలేదు. ఓ రోగికి సెలైన్ పూర్తికావడంతో సిబ్బంది వద్దకు రోగి సహాయకులు వచ్చి సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం కొద్ది సమయం వెతికిన అనంతరం ఆమెకు ఫోన్‌చేశారు. సమాధానం లేకపోవడంతో నర్సుల గదికి వెళ్లిచూడగా లోపల చనిపోయి ఉంది.
రాజాంకు చెందిన హేమలత ఉదయం ఇంటి వద్ద సరదాగా గడిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఇంటి పనులు ముగించుకుని మధ్యాహ్నం విధులకు హాజరైంది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఆత్మహత్య లేఖ లభ్యమైంది. ఎస్సై ఈ లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లేఖలో తన చావుకు ఎవరూ కారణం కాదని తనను క్షమించాలంటూ పేర్కొంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.