రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియర్.. సీఎం జగన్ ఆదేశాలతో..

Update: 2019-11-06 08:48 GMT

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియరైంది. ఆగమ శాస్త్ర సలహాదారుగా అవకాశం కల్పిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఎల్వీ బదిలీ నేపథ్యంలో రమణ దీక్షితులు నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాలతో టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం ఆదేశంతో మళ్లీ ఆయన్ను తీసుకున్నారు.

ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పున:ప్రవేశం కల్పించింది. తన నియామకం నేపథ్యంలో రమణదీక్షితులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిశారు.

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా టీటీడీలో అరాచకాలు జరిగాయని ఆరోపణలు చేయడంతోపాటు స్వామివారి వజ్రాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోటులో తవ్వకాలు జరిపారని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో గత ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా కూడా వేసింది.

అయితే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి రేగడంతో రమణ దీక్షితులును తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎస్‌గా ఉన్న ఎల్వీని అనూహ్యంగా అప్రాధాన్య పోస్టు అయిన మానవ వనరుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం రమణ దీక్షితులకు శ్రీవారి ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రమణ దీక్షితులు ఇప్పుడు టీటీడీకి ఆగమ సలహాదారుడిగా ఎలా ఉండబోతారు? అధికారుల సమన్వయంతో మెలుగుతారా..? లేక గతంలో మాదిరిగానే విభేదాలు సృష్టించుకుంటారా..? అన్నది చూడాలి. 

Tags:    

Similar News