విశాఖలో భగ్గుమంటున్న భూముల ధరలు

Update: 2020-01-03 13:33 GMT
విశాఖలో భగ్గుమంటున్న భూముల ధరలు

ఎగ్జి్క్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనతో విశాఖపట్నానికి గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ వచ్చింది. రియల్ దందాలో కొత్త జోష్ వచ్చింది. భూములు, ఇళ్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇళ్ల అద్దె పెరుగుతోంది. పేద, మధ్య తరగతివర్గం వారు నివాసం ఉండేందుకు అద్దె చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని వైజాగ్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖలో భగ్గుమంటున్న భూముల ధరలు - ఇళ్ల ధరలకు రెక్కలు - పెరుగుతోన్న ఇళ్ల అద్దె - ఊపందకుంటున్న రియల్ దందా - ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనతో భారీ డిమాండ్.

విశాఖను ఎగ్జి్క్యూటివ్ క్యాపిటల్ గా సీఎం జగన్ ప్రతిపాదించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు అందుకుంటోంది. భూముల ధరలు రెట్టింపు అవుతున్నాయి. గతంలో భూములు అమ్ముతామని చెప్పినవారు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. వైజాగ్ రాజధాని అయిన తర్వాత తమ భూములు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతాయనే ఆశలో వున్నారు. ఇళ్ల అమ్మకం పరిస్థితి కూడా అలాగే వుంది.

భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడ, మధురవాడ మధ్య ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పడవచ్చన్న ప్రచారం నడుస్తుంది. ఈ ప్రాంతంలో ఆరిలోవ, సాగర్ నగర్, పీఎం పాలెం, కార్ షెడ్ ఏరియాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సింగిల్ బెడ్ రూమ్ కు నాలుగు వేలు, డబుల్ బెడ్ రూమ్ కు ఆరువేల అద్దె వుంది. ఎగ్జి్క్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన తర్వాత అద్దె పెంచాలని యాజమానుదారులు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన వస్తే ఇళ్ల అద్దెలు డబుల్ అయ్యే అవకాశం వుంది.

నగరంలోని ఎం.వి.పి కాలనీ, సీతమ్మధార,కీర్లంపూడి లే అవుట్ , వుడా కాలనీ, దస్పల్లా హిల్స్ , విశాలాక్షి నగర్ లో బడాబాబులు ఉంటారు. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, వన్ టౌన్ ఏరియా, కంచరపాలెం, మర్రిపాలెంలో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు చేస్తే విశాఖకు అధికారులతో పాటు ఉద్యోగ వ్యాపారవర్గాలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో ఇంటి అద్దెలు పెరగక తప్పని పరిస్థితి నెలకొంటుంది.

వైజాగ్ లో ఇప్పుడు ప్రైవేట్ ఆఫీస్ కు పెట్టేందుకు భవనాలు దొరకడం కష్టమైంది. ప్రధాన కూడళ్లలో ఆఫీసుల అద్దెలను భారీగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కిరాయిలు మరింత పెరిగే అవకాశం వుందంటున్న నగరవాసులు అద్దె సంబంధింత చట్టాలను సమర్థంగా అమలు చేసి కిరాయిలను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో వుండే విశాఖ ఎగ్జి్క్యూటివ్ క్యాపిటల్ తర్వాత కూడా అదే తరహాలో వుండాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు.

Full View 

Tags:    

Similar News