కంచే.. చేను మేస్తే..? అవినీతిని బట్టబయలు చేయాల్సిన వారే అక్రమాలకు పాల్పడితే..? ఓ అధికారిని పట్టుకోబోయిన ఏసీబీ అధికారులే.. అడ్డంగా దొరికితే..? 15 రోజుల క్రితం విశాఖలోని మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ సోదాలు అక్రమమని తేలింది. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. లోపాయకారి ఒప్పందంతో జరిగిన ఈ దాడులపై ఏకంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పందించారు. తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఏసీబీ డీజీని లేఖ రాశారు.
సినిమా స్క్రిప్ట్‌కు ఏమాత్రం తీసిపోని రియాల్టీ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ నెల 9 న మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపించని 61 వేల 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ తారకేశుపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే తారకేశును బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం కూడా తీసుకున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో పేరుకుపోతున్న అవినీతిని అంతమొందించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం జూనియర్ స్థాయి అధికారులను సబ్ రిజిస్ట్రార్‌లుగా నియమించింది. అయితే పాతవారితో వాటాలు అలవాటు పడిన ఏసిబి అధికారులు కొత్తగా చేరిన వారిని ట్రాప్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేశును టార్గేట్ చేసిన ఏసీబీ అధికారులు రైడ్స్ పేరుతో ఓ ఫిర్యాదుదారుడిని సృష్టించి 61 వేల 500 డబ్బులు తెచ్చి రికార్డ్స్‌లో పెట్టారు. దీంతో రిటర్న్ డాక్యూమెంట్‌లో డబ్బులు కనిపించినట్టు కేసు నమోదు చేసారు. తరువాత ఆ డబ్బంతా అనధికార సొత్తుగా ప్రకటించి అక్రమాలు జరుగుతున్నాయని నిర్ధారించి కేసు నమోదు చేశారు. అలా ఆయన్ని విశాఖ నుండి శ్రీకాకుళం బదిలీ చేయించారు.
అయితే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ సబ్ రిజిస్ట్రార్ తారకేశు రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారు. ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని లేఖకు అనుసంధానం చేశారు. అవినీతి, అక్రమాలు అంటూ ఫేక్ రైడ్స్ చేసిన ఏసీబీ అధికారుల బాగోతం సీసీ కెమెరాలకు చిక్కడంతో అసలు నిజం బయటపడింది. దీనిని పరిశీలించిన డిప్యూటీ సీఎం అది అక్రమ కేసు అని నిర్థారించుకున్నారు. ఏసీబీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తప్పుడు పద్దతుల్లో వెళ్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కారు విశాఖ రేంజ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల డీఐజీ రవీంద్రనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.