కరోనా వేళలో ఇంటి కిరాయిల ఇక్కట్లు.. కనికరించని యజమానులు!

Update: 2020-06-05 06:00 GMT

కరోనా ప్రజలను ఇంటికి పరిమితం చేస్తే ఇంటి ఓనర్స్‌ మాత్రం అద్దె ఇవ్వకపోతే బయటకే అంటున్నారు. లాక్‌డౌన్‌ కష్టాల్లో ఇళ్ల అద్దెలు సామాన్యులకు సమస్యగా మారుతున్నాయి. విశాఖలో వలసల పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అద్దెలు చెల్లించలేక, చేతిలో చిల్లిగవ్వలేక అవస్థలు తప్పడం లేదు.

విశాఖ మహానగరంలో 22 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఇందులో దాదాపు 60 శాతం మంది అద్దె ఇంటిని ఆశ్రయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖలో పొరుగు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. మధ్య తరగతి వారు ఎక్కువ ఉండే కంచరపాలెం, మర్రిపాలెం, మద్దిలపాలెం, మధురవాడ, పెందుర్తి, వన్‌టౌన్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు 3వేల నుంచి 5వేల వరకు ఉంటున్నాయి. అదేకాస్త మధ్య తరగతి ప్రాంతాల్లో అయితే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఉంటే దాదాపు 7వేల నుంచి 10వేల వరకు ఉంటుంది.

సామాన్యులు వారి సంపాదనలో సగం ఇంటి అద్దెలకే చెల్లిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో దాదాపు రెండు నెలల నుంచి ఉపాధి లేక, చేతిలో చిల్లిగవవ్వలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

విశాఖ నగర పాలక సంస్థ ఇంటి పన్నులు, నీటి పన్నులు భారీగానే వసూలు చేస్తుంది. దీంతో ఇంటి ఓనర్స్‌ అద్దెల విష‍యంలో కచ్చితంగా ఉంటున్నారు. అయితే గత 2 నెలల నుంచి కాస్తా చూసీచూడనట్లు ఉన్నా తాజాగా సడలింపులతో సామాన్య జీవనం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. దీంతో కచ్చితంగా అద్దెలు చెల్లించాల్సిందేనంటూ ఇంటి యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల అద్దెల వసూళ్లపై స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఇస్తే బావుంటుందంటున్నారు ప్రజలు.

Full View


Tags:    

Similar News