12 ఏళ్ల క్రితం మందలించారని ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతుర్ని కన్నవారి చెంతకు చేర్చారు విజయవాడ పోలీసులు. ఆ సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆదిలక్ష్మిని తమిళనాడుకు చెందిన ఓ మహిళకు బెజవాడకు చెందిన ఓ మహిళ అమ్మేసింది. 12 ఏళ్లుగా తమిళనాడులోని తిరువనంతపురంలో ఆదిలక్ష్మి పెరిగింది. లతగా ఆమె పేరును మార్చారు. అయితే ఆదిలక్ష్మిని పెంచిన మహిళ చనిపోవడంతో సొంత తల్లిదండ్రులను చూడాలని ఆమె భావించింది.
భర్త సహకారంతో బెజవాడ పోలీసులను ఆశ్రయించింది ఆదిలక్ష్మి. తల్లిదండ్రులతో కలపాలంటూ స్పందనలో పిటిషన్ పెట్టుకుంది. మీడియాలో వార్తలు చూసి సీపీ ఆఫీసుకు ఆదిలక్ష్మి తల్లిదండ్రులు వచ్చారు. దీంతో కన్నతల్లిదండ్రులతో ఆదిలక్ష్మిని కలిపారు సీపీ ద్వారకాతిరుమలరావు. కన్నవారిని చూసి ఆదిలక్ష్మి అలియాస్ లత కన్నీరుమున్నీరుగా విలపించింది.