'వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్' కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు తొలి విడత రూ.7,500 సాయం అందిస్తున్నామని సీఎం ప్రకటించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు.
ఈ నెల 30న రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు. రైతుల అకౌంట్లలో నేరుగా నగదు జమచేస్తామన్నారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని ఈ పథకం ప్రవేశ పెట్టామని వివరించిన సీఎం జగన్ పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు.