రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమరం.. 14న పయ్యావుల కేశవ్ ‘వజ్ర’ బడ్జెట్!
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వరుస సమీక్షలతో సభను సిద్ధం చేస్తున్నారు.
సమావేశాల షెడ్యూల్ ఇలా..
రేపు ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటపాటు సాగే ఈ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించనున్నారు.
ఉదయం 11:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ భేటీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
స్పీకర్ అయ్యన్న వరుస సమీక్షలు
సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈరోజు మధ్యాహ్నం నుంచి కీలక భేటీలు నిర్వహించనున్నారు:
మధ్యాహ్నం 2:30 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించే క్రీడా, సాంస్కృతిక పోటీలపై మంత్రులతో సమీక్షించనున్నారు.
3:30 గంటలకు సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి సభ్యుల ప్రశ్నలు, ప్రభుత్వం ఇచ్చే సమాధానాలపై చర్చించనున్నారు.
సాయంత్రం 4:30 గంటలకు డీజీపీ సహా ఉన్నత పోలీస్ అధికారులతో అసెంబ్లీ భద్రతపై కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో ఈ సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.