Sangareddy: భర్త చేసిన మోసానికి భార్య బలి.. అంగన్‌వాడీ టీచర్‌పై అమానుష దాడి

Sangareddy: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో అమానుషం. భర్త ఫైనాన్స్ పేరుతో మోసం చేసి పారిపోవడంతో, అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న వసంతకుమారిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి అవమానించారు.

Update: 2026-04-09 07:06 GMT

Sangareddy: భర్త చేసిన మోసానికి భార్య బలి.. అంగన్‌వాడీ టీచర్‌పై అమానుష దాడి

తప్పు చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షించాల్సింది పోయి, సంబంధం లేని మహిళపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు వసూలు చేయాలనే నెపంతో, విధుల్లో ఉన్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ను నిందితులు చెట్టుకు కట్టేసి అవమానపరిచారు.

అసలేం జరిగింది?

కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి రాసోల్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ప్రభాకర్ గతంలో 'హెచ్‌బీఎం ఫైనాన్స్' పేరుతో స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించాడు. గ్రామానికి చెందిన అవుటి సాయవ్వ, చాకలి బాలామణి, భూతాలే వైద్యనాథ్, అవుటి బండ్యప్ప, కోటగిరి రాములు వంటి వారిని మోసం చేసి ప్రభాకర్ ఇటీవల ఊరు విడిచి పారిపోయాడు.

చెట్టుకు కట్టేసి అరాచకం

తమ డబ్బులు పోయాయన్న ఆగ్రహంతో ఉన్న బాధితులు, మంగళవారం విధులకు హాజరైన వసంతకుమారిని అడ్డుకున్నారు. భర్త ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమెను బలవంతంగా తాళ్లతో చెట్టుకు కట్టేసి నలుగురిలో అవమానించారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. అనంతరం గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆమెను విడిచిపెట్టారు.

పోలీసుల విచారణ

ఈ అమానుష ఘటనపై బుధవారం వసంతకుమారి కంగ్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, మహిళను ఇలా అవమానించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News