Karimnagar: ఆదర్శంగా కేంద్ర మంత్రి.. సొంత ఇంటిపై సోలార్ ప్యానెల్!
Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లోని తన నివాసంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు.
Karimnagar: ఆదర్శంగా కేంద్ర మంత్రి.. సొంత ఇంటిపై సోలార్ ప్యానెల్!
కరీంనగర్: రాష్ట్రంలోని వార్డు మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తమ తమ ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
అధికారులతో కలిసి సోలార్ ప్యానెల్ ను పరిశీలించిన బండి సంజయ్..
ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఉదయం టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్ తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు రూపొందించిన ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.
సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతోపాటు 80 శాతం లోన్ వస్తుంది..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు నా ఇంటిపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ఈ దేశాన్ని కాపాడాలి. దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మహానేత మోదీ. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం.. ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ‘‘PM సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’’ పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టినం. ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినం.
ప్రతి ఒక్కరికి సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించాలి..
తొలుత ప్రజాప్రతినిధులంతా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. కాబట్టి వార్డ్ మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా. సోలార్ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోంది. ఎందుకంటే 2024లో ఈ పథకం ప్రవేశపెట్టినా ఇంతవరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 5 నుండి 7 వేల కుటుంబాలు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సరిపడా కేంద్రం నిధులు కేటాయించింది.
విద్యుత్ కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలి..
అందుకే ప్రజలందరినీ కోరుతున్నా.. ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటే.. అందుకయ్యే వ్యయంలో 30 వేల నుండి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది. నా ఇంటి విద్యుత్ బిల్లులు ప్రతినెలా 25 నుండి రూ.30 వేలు ఖర్చు వస్తోంది. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా ఇకపై బిల్లులు రూ.5 వేలలోపే వచ్చే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ ను కొనుగోలు చేసే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలన్నది మోదీ ఆకాంక్ష. రైతులు, సామాన్య ప్రజలంతా ఈ సోలార్ వ్యవస్థను వాడుకుని కరెంట్ ను కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని కోరుతున్నా.
వ్యవసాయంలో సౌరశక్తిని పెంచాలి..
పేద ప్రజలకు కూడా భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుంటే.. 80 శాతం వరకు లోన్ వస్తుంది. అది కూడా వాయిదాల పద్దతిలో చెల్లించే అవకాశముంది. కాబట్టి ఏ మాత్రం భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.అట్లాగే వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో PM-KUSUM (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించండి..
ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని TG-REDCO సంస్థ లక్ష్యం పెట్టుకుంది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, గ్రామ మండల సమాఖ్యలు ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు కరీంనగర్ లో 46, సిరిసిల్లలో 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 63 ఆమోదం ఆమోదం పొందాయి. రైతులు తమ పొలాలకు అవసరానికి మించి అదనపు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా.