Armoor: సైకిల్‌పై వచ్చి వినతిపత్రం.. కుక్కల బెడదపై బాలుడి పోరాటం!
Armoor: ఆర్మూర్ 33వ వార్డులో వీధి కుక్కల బెడదపై 5వ తరగతి విద్యార్థి మహేష్ మున్సిపల్ కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లి వినతిపత్రం అందజేశారు.
Armoor: సైకిల్‌పై వచ్చి వినతిపత్రం.. కుక్కల బెడదపై బాలుడి పోరాటం!
ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. నెల రోజుల క్రితం ఓ చిన్న బాలుడిని కుక్క కరువడంతో గాయాలు కావడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అయితే పెద్దలు స్పందించాల్సిన సమయంలో… సమస్య పరిష్కారానికి ఒక విద్యార్థి ముందుకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఐదవ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థి తన వార్డులోని సమస్యను చిన్నది అనుకోలేదు. ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తూ, వస్తూ కుక్కల భయంతో చిన్నపిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారో అతను గమనించాడు. “ఇది ఇలాగే కొనసాగితే ఇంకెవరైనా గాయపడొచ్చు” అనే ఆలోచన అతనిలో బాధను కలిగించింది. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారం కోసం అధికారులను సంప్రదించాలని నిర్ణయించుకున్న మహేష్… స్వయంగా ఒక వినతిపత్రం సిద్ధం చేశాడు. ఎలాంటి పెద్దల సహాయం లేకుండా, తన చిన్న సైకిల్‌పై ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని, మున్సిపల్ చైర్మన్ గోనే లహరి కి ఆ వినతిపత్రం అందజేశాడు.
మహేష్ చేసిన ఈ చిన్న ప్రయత్నం వెనుక ఉన్న పెద్ద మనసు అందరినీ కదిలిస్తోంది. తన వయస్సులో పిల్లలు ఆటలు, చదువులతో గడిపే సమయంలో… సమాజం కోసం ఆలోచించడం, సమస్యను గుర్తించి పరిష్కారం కోసం అడుగు వేయడం నిజంగా అభినందనీయం.