Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రేర్ రికార్డు!
Virat Kohli Creates IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ ఛేదనలో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Virat Kohli Creates IPL History
Virat Kohli Creates IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ ఛేదనలో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో నమోదు చేశాడు. శనివారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 69 రన్స్ చేయడంతో కోహ్లీ ఛేదనలో 4000 రన్స్ పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ మరో ఘనత కూడా అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను కింగ్ అధిగమించాడు. మాలిక్ 557 మ్యాచుల్లో 13,571 పరుగులు బాదాడు. 35.99 సగటుతో 83 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. విరాట్ 415 మ్యాచుల్లోనే 13,612 పరుగులు చేశాడు. 42.14 సగటుతో 9 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. విరాట్ అత్యధిక స్కోర్ 122 నాటౌట్. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్.. ఇపుడు వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయినా కూడా టీ20ల్లో కింగ్ పరుగుల వరద పారిస్తున్నాడు. రన్ చేజ్‌లలో కోహ్లీ చూపిన స్థిరత్వం, మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యం ఆయనను ఈ అరుదైన మైలురాయికి చేర్చాయి.
విరాట్ కోహ్లీ అవుట్ కాకుండా మరో అర్ధశతకం నమోదు చేశాడు. తన అజేయ 50+ స్కోర్ల సంఖ్యను హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ మ్యాచ్‌లను ముగించగల అతని సామర్థ్యాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను అధిగమించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50కి పైగా స్కోర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. రన్ ఛేజ్‌లలో అత్యధిక 50+ స్కోర్ల జాబితాలో కూడా కోహ్లీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఈ రికార్డులతో తన స్థిరత్వం, ఫిట్‌నెస్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేశాడు. ముఖ్యంగా రన్ చేజ్‌లలో ఆయన ప్రదర్శన టీమ్‌కు ఎన్నో విజయాలు అందించింది.