IPL 2026: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే వివాదం..ఇదేందయ్యా ఇలా చేశారు

IPL 2026: ఆరెంజ్ ఆర్మీ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ అవుట్ ఇచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.

Update: 2026-03-29 03:53 GMT

IPL 2026: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే వివాదం..ఇదేందయ్యా ఇలా చేశారు

IPL 2026 Controversy: ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ, భారీ సిక్సర్లు, మెరుపు వేగంతో సాగే ఆట. కానీ 2026 సీజన్ మాత్రం ఊహించని వివాదంతో అట్టహాసంగా మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన పోరులో ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. 'క్లాసెన్ అవుట్' అంటూ థర్డ్ అంపైర్ ఇచ్చిన తీర్పుపై విమర్శల జడివాన కురుస్తోంది.

అసలేం జరిగిందంటే?

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రోమారియో షెపర్డ్ వేసిన షార్ట్ డెలివరీని హెన్రిక్ క్లాసెన్ మిడ్-వికెట్ వైపు స్టాండ్స్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫిల్ సాల్ట్ అద్భుతమైన డైవ్‌తో ఆ బంతిని అందుకున్నాడు. అయితే, రీప్లేలను నిశితంగా గమనిస్తే సాల్ట్ కింద పడే క్రమంలో అతని వెనుక భాగం లేదా పాదం బౌండరీ కుషన్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. కుషన్ స్వల్పంగా కదలడం కూడా టీవీల్లో రికార్డ్ అయింది.కానీ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ థర్డ్ అంపైర్ కనీసం 'బ్యాక్ యాంగిల్' కూడా చెక్ చేయకుండానే క్లాసెన్ అవుట్ అని ప్రకటించారు. దీంతో క్రీజులో ఉన్న క్లాసెన్ (31 పరుగులు) షాక్‌కు గురై పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

మైఖేల్ వాన్ ఘాటు స్పందన

ఈ నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. "నాకు తెలిసైతే ఫిల్ సాల్ట్ పాదం ఖచ్చితంగా బౌండరీ కుషన్‌ను తాకింది. అసలు ఎటువంటి సందేహం లేకుండా దాన్ని అవుట్ అని ఎలా ఇస్తారు? కుషన్ కూడా కదిలింది కదా. కీలకమైన బ్యాక్ యాంగిల్ చూడకుండా నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు." అని ఆయన ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో జూమ్ వార్

హైదరాబాద్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? మ్యాచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు, వీడియో క్లిప్పింగ్స్‌తో రచ్చ మొదలుపెట్టారు. సాల్ట్ వంగినప్పుడు అతని టీ-షర్ట్ కుషన్‌ను తాకడం వల్ల అది తన స్థానం నుంచి పక్కకు జరగడాన్ని నెటిజన్లు వేలెత్తి చూపుతున్నారు. "అంపైరింగ్ ప్రమాణాలు ఇంత దారుణంగా ఉంటాయా?" అంటూ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

మ్యాచ్ ఫలితంపై ప్రభావం

క్లాసెన్ లాంటి డేంజరస్ బ్యాటర్ ఆ సమయంలో క్రీజులో ఉండి ఉంటే హైదరాబాద్ స్కోరు కనీసం మరో 20-30 పరుగులు అదనంగా వచ్చేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అదనపు పరుగులు ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించినప్పటికీ, ఈ బౌండరీ వివాదం మాత్రం ఐపీఎల్ 2026 ఆరంభంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది.






Tags:    

Similar News