CSK-MS Dhoni IPL 2026 Injury: సీఎస్‌కే అభిమానులకు షాక్.. లెజెండ్ ఎంఎస్ ధోనీ దూరం!

CSK-MS Dhoni Injury Shock: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రాంచైజీకి భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ తొలి రెండు వారాలకు అందుబాటులో ఉండడం లేదు.

Update: 2026-03-28 15:04 GMT

MS Dhoni

MS Dhoni IPL 2026 Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రాంచైజీకి భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ తొలి రెండు వారాలకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. మహీ త్వరగా కోలుకొని మైదానంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్టు చేసింది. దాంతో ధోనీ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.

ఎంఎస్ ధోనీ కాలి కండరాల (క్యాల్ఫ్ స్ట్రెయిన్) గాయంతో బాధపడుతున్నాడు. మొన్నటివరకూ చెన్నై ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొన్న ధోనీ.. తాజాగా పిక్క గాయం బారిన పడ్డాడు. దాంతో అతడు ఐపీఎల్ 2025 మొదటి రెండు వారాలు దూరమయ్యాడు. 'ఎంఎస్ ధోనీ ప్రస్తుతం గాయం కారణంగా రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2026 తొలి రెండు వారాల్లో అతను అందుబాటులో ఉండడు. మహీ త్వరగా కోలుకొని మైదానంలోకి రావాలని కోరుకుంటున్నాం' అని సీఎస్‌కే ఫ్రాంచైజీ పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ధోనీ దూరంగా ఉండనున్నాడు.

ఎంఎస్ ధోనీ లేకపోవడంతో వికెట్‌కీపింగ్ బాధ్యతలను సంజు శాంసన్ చేపట్టనున్నాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేకు మారిన సంజు.. తొలి మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించనున్నాడు. ధోనీ స్థానంలో యువ ఆటగాడు ఉర్విల్ పటేల్‌కు అవకాశం రావచ్చు. కనీసం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అయినా వస్తాడని ఆశించిన మహీ అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించేదే. తొలి రెండు వారాలు అంటే.. కనీసం నాలుగు మ్యాచులను ధోనీ మిస్‌ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న పంజాబ్‌, ఏప్రిల్ 5న బెంగళూరు, ఏప్రిల్ 11న ఢిల్లీతో చెన్నై ఆడనుంది. ధోనీ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఏప్రిల్ 14న కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇటీవల చెపాక్‌లో జరిగిన ‘ROAR 26’ ఈవెంట్‌లో ఎంఎస్ ధోనీ తన ఫిట్‌నెస్ తగ్గుతోందని స్వయంగా అంగీకరించడం గమనార్హం. వయసు, మోకాలి సమస్యలు కారణంగా అతను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి దిగుతూ.. డెత్ ఓవర్లలో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. అయినప్పటికీ అతని హిట్టింగ్ సామర్థ్యం అభిమానులను అలరిస్తూనే ఉంది. ఐపీఎల్ కెరీర్‌లో 278 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 5,439 పరుగులు సాధించి టోర్నమెంట్ చరిత్రలో ఆరో స్థానంలో నిలిచాడు. 24 అర్ధశతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. గత సీజన్‌లో కూడా సీఎస్‌కే నిరాశపరిచినా.. ధోనీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాడు.

Tags:    

Similar News