IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభమే అదిరింది.. సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘనవిజయం

IPL 2026 : ఐపీఎల్ 2026 ఓపెనర్‌లో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. కోహ్లీ, పడిక్కల్ వీరోచిత బ్యాటింగ్‌తో 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది.

Update: 2026-03-29 01:55 GMT

RCB vs SRH

 IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. తొలి మ్యాచ్‌లోనే పరుగుల వర్షం కురిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన ఈ పోరులో ఆఖరికి ఈ సారి కప్ నమదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేశారు. హైదరాబాద్ నిర్దేశించిన 200 పైచిలుకు భారీ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించేశారు. విరాట్ కోహ్లీ అజేయ ఇన్నింగ్స్, దేవదత్ పడిక్కల్ మెరుపులు వెరసి ఆర్సీబీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43), క్లాసెన్ (31) మెరుపులు మెరిపించడంతో స్కోరు 200 దాటింది. అయితే ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ (3 వికెట్లు), రోమారియో షెపర్డ్ (3 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక సమయాల్లో వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ స్కోరును కట్టడి చేశారు. లేదంటే ఆ స్కోరు 230 దాటేది.

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే చిన్న కుదుపు తగిలింది. కానీ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. జాకబ్ డఫీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‎గా వచ్చిన దేవదత్ పడిక్కల్ గ్రౌండ్‌లో పూనకం వచ్చినట్లు ఆడాడు. కేవలం 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఎస్ఆర్‌హెచ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

పడిక్కల్, కోహ్లీ ఇచ్చిన ఊపును కెప్టెన్ రజత్ పాటిదార్ కొనసాగించాడు. పాటిదార్ కేవలం 12 బంతుల్లో 31 పరుగులు చేసి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 200 పైచిలుకు స్కోరును ఇంత తక్కువ ఓవర్లలో ఛేదించడం ఆర్సీబీ హిస్టరీలోనే ఒక రికార్డు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి సీనియర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 190 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ ఫామ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, తన నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకుంది. ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలవ్వడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేసినా, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మాత్రం మెప్పించింది.

Tags:    

Similar News