NZ vs SA 2nd T20: రెచ్చిపోయిన ఫెర్గూసన్, సియర్స్.. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం!

NZ vs SA 2nd T20: హామిల్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 15.3 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. దాంతో కివీస్ 68 పరుగుల తేడాతో గెలిచింది.

Update: 2026-03-17 11:43 GMT

NZ vs SA 2nd T20: రెచ్చిపోయిన ఫెర్గూసన్, సియర్స్.. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం!

NZ vs SA 2nd T20: హామిల్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 15.3 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. దాంతో కివీస్ 68 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జార్జ్ లిండే (33) టాప్ స్కోరర్. కివీస్ విజయంలో ఓపెనర్ డెవాన్ కాన్వే (60), బౌలర్లు లాకీ ఫెర్గూసన్ (3 వికెట్స్), బెన్ సియర్స్ (3 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో సఫారీలు విజయం సాధించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

రెండో టీ20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు టామ్ లాతమ్ (11), డెవాన్ కాన్వేలు మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. లాతమ్‌ను కేశవ్ మహారాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే టిమ్ రాబిన్సన్ (1)ను జార్జ్ లిండే అవుట్ చేశాడు. ఈ సమయంలో కాన్వే ఆచితూచి ఆడాడు. నిక్ కెల్లీ (21), మిచెల్ సాంట్నర్ (20)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ బాది అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో కోల్ మెక్‌కాంచీ (18), జోష్ క్లార్క్సన్ (26) మెరుపులతో కివీస్ స్కోర్ 170 దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 2 వికెట్స్ పడగొట్టాడు.

లక్ష ఛేదనలో దక్షిణాఫ్రికాకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు వియాన్ ముల్డర్ (16), కానర్ ఎస్టర్హుయిజెన్ (8) త్వరగానే అవుట్ అయ్యారు. ఆ వెంటనే టోనీ డి జోర్జీ (1) కూడా విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లు రెచ్చిపోవడంతో రూబిన్ హెర్మాన్ (19), జాసన్ స్మిత్ (12), డయాన్ ఫారెస్టర్ (10) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జార్జ్ లిండే ఒంటరి పోరాటం చేశాడు. జెరాల్డ్ కోట్జీ (2), కేశవ్ మహారాజ్ (0), న్కోబాని మోకోయెనా (0) కూడా నిరాశపర్చారు. దాంతో దక్షిణాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. హాఫ్ సెంచరీతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కాన్వేకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఆక్లాండ్ వేదికగా మార్చి 20న మూడో వన్డే జరగనుంది.

Tags:    

Similar News