India ICC Finals: ఆ స్టేట్ ప్లేయర్ జట్టులో ఉంటే.. ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియాకు ఓటమే లేదు!

India ICC Finals: భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. జట్టులో కేరళకు చెందిన ఆటగాడు ఉంటే..ఏ ప్రపంచ కప్ ఫైనల్‌ను కూడా ఓడిపోలేదు.

Update: 2026-03-16 15:02 GMT

India ICC Finals

India ICC Finals: టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వరుసగా రెండోసారి (2024, 2026) టైటిల్ కైవసం చేసుకుంది. భారత్ మొత్తంగా మూడోసారి (2007, 2024, 2026) పొట్టి ప్రపంచ కప్‌ను గెలుచుకుని.. స్వదేశంలో కప్పు గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. జట్టులో కేరళకు చెందిన ఆటగాడు ఉంటే.. భారత్ ఇప్పటివరకు ఏ ప్రపంచ కప్ ఫైనల్‌ను కూడా ఓడిపోలేదు.

ఎస్ శ్రీశాంత్:

మొదటిసారి ఈ రికార్డు 1983 వన్డే ప్రపంచ కప్ సమయంలో నమోదైంది. ఆ టోర్నీలో భారత జట్టులో కేరళకు చెందిన సునీల్ వాల్సన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ ఫైనల్‌లో భారత్ విజయం సాధించి మొదటిసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచ కప్‌లో కేరళ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ భారత జట్టులో భాగమయ్యాడు. ఆ టోర్నీలో కూడా భారత్ విజయం సాధించింది. అదే విధంగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో కూడా శ్రీశాంత్ జట్టులో ఉండగా.. భారత్ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

సంజు సాంసన్:

ఇటీవల జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సాంసన్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో భారత్ విజయం సాధించింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో కూడా సంజు జట్టులో భాగంగా ఉండగా.. భారత్ మరోసారి టైటిల్ గెలుచుకుంది. అలా కేరళకు చెందిన ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు ఫైనల్‌లో భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ గణాంకాలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇది యాదృచ్ఛికమా? లేక నిజంగా అదృష్టమా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచ కప్‌లో కేరళ ప్లేయర్స్ వీరే:

1983 వన్డే ప్రపంచ కప్‌- సునీల్ వాల్సన్

2007 టీ20 ప్రపంచ కప్‌- ఎస్ శ్రీశాంత్

2011 వన్డే ప్రపంచ కప్‌- ఎస్ శ్రీశాంత్

2024 టీ20 ప్రపంచ కప్‌- సంజు శాంసన్

2026 టీ20 ప్రపంచ కప్‌- సంజు శాంసన్

Tags:    

Similar News