Suryakumar Yadav: టీ20 ఫార్మాట్‌లో నేనే మాస్టర్.. ఆ ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దంటారా?
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ ఆడాలని ఇప్పటికీ కోరిక ఉందన్నాడు
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ 2026 విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ ఆడాలని ఇప్పటికీ కోరిక ఉందని, అయితే తనకు టీ20 ఫార్మాట్‌లోనే ఆట పూర్తిగా సెట్ అయిందన్నాడు. తానిప్పుడు పొట్టి ఫార్మాట్‌లో మాస్టర్‌ను అయ్యా అని, టీ20ల్లో ఆడటమే ఎంతో బాగుందన్నాడు. ఎవరైనా సరే టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వస్తే వద్దంటారా? అని సూర్య చెప్పుకొచ్చాడు. పీటీఐకు ఇచ్చిన ప్రత్యేక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ ఈ విషయాలను పంచుకున్నాడు.
రెడ్ బాల్ క్రికెటే ఎక్కువ ఆడా:
టెస్టుల్లో ఆడకపోవడానికి ఏదైనా కారణం ఉందా అనే ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... 'నేను మొదట రెడ్ బాల్ క్రికెట్‌తోనే కెరీర్ ప్రారంభించా. 2010-11 నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైలో పెరిగే క్రికెటర్లకు రెడ్ బాల్ క్రికెట్ చాలా ముఖ్యం. అందుకే చిన్నప్పటి నుంచి అదే ఫార్మాట్‌లో ఎక్కువగా ఆడాను. కాలక్రమేణా వైట్ బాల్ క్రికెట్ వైపు నా దృష్టి మళ్లింది. ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌లో అవకాశాలు రావడంతో ఆ ఫార్మాట్‌లోనే నేను మెరుగ్గా రాణించా. టీ20ల్లో ఎలా ఆడుతున్నానో మీరు చుస్తునారు. పొట్టి ఫార్మాట్‌లో నా ఆట పూర్తిగా సెట్ అయింది' అని చెప్పాడు.
అవకాశం వస్తే ఆడుతా:
టెస్ట్ క్రికెట్‌లో అవకాశం వస్తే ఆడాలనుకుంటారా? అనే ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు . 'ఖచ్చితంగా ఆడాలని ఉంది. దాదాపు 10 సంవత్సరాలు రెడ్ బాల్ క్రికెట్ ఆడాను. ఆ ఫార్మాట్ నాకు చాలా ఇష్టం. అవకాశం వస్తే ఎవరు టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకోరు?' అని అన్నారు. సూర్యకుమార్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడారు. 2023లో Aఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశారు.
వన్డే ఫార్మాట్ చాలా క్లిష్టం:
వన్డే క్రికెట్ గురించి కూడా సూర్యకుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'వన్డే ఫార్మాట్ చాలా క్లిష్టమైంది. ఇందులో మూడు విధాలుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో వికెట్లు పడితే టెస్ట్ క్రికెట్ తరహాలో ఆడాలి. మధ్యలో మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయాలి. చివర్లో టీ20 తరహాలో వేగంగా ఆడాల్సి ఉంటుంది. అందుకే వన్డే ఫార్మాట్ నాకు పూర్తిగా అర్థం కాలేదని అనిపిస్తుంది. చూసేందుకు బాగానే ఉన్నా ఎన్నో సవాళ్లు ముందుంటాయి. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఆడాను. అభిమానుల నుంచి మంచి ఆదరణ దక్కింది' అని సూర్య చెప్పుకొచ్చాడు.
వన్డే క్రికెట్‌కు ప్రత్యేక ఆకర్షణ:
ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం తగ్గుతుందనే చర్చలపై సూర్యకుమార్ స్పందించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో జట్టులో ఉన్నప్పుడు ఆ ఫార్మాట్‌కు ప్రత్యేకమైన వాతావరణం, ఉత్సాహం ఉంటుందని అనిపించింది. టీ20, టెస్ట్‌ల మాదిరిగానే వన్డే క్రికెట్‌కూ ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని పేర్కొన్నారు. మొత్తానికి తనకు టీ20 ఫార్మాట్‌లో ఆట పూర్తిగా సెట్ అయినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌పై ప్రేమ మాత్రం ఇప్పటికీ తగ్గలేదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.