Vaibhav Sooryavanshi: అవి రెండే నా టార్గెట్.. ఐపీఎల్ 2026 ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ కప్ అందించడం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే తన టార్గెట్ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi: అవి రెండే నా టార్గెట్.. ఐపీఎల్ 2026 ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఎందరో స్టార్స్ ఉన్నా.. అందరి దృష్టి మాత్రం 14 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు గత సీజన్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు లక్ష్యాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని వైభవ్ తాజాగా ఓ చిట్‌చాట్‌లో వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ కప్ అందించడం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే తన టార్గెట్ అని తెలిపాడు.
13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీలో కాంట్రాక్ట్ పొందిన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని 2024లో కేవలం 13 ఏళ్ల వయసులో రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడికి కెరీర్‌లో ఇదే కీలక మలుపుగా మారింది. 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2025లో జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ అనంతరం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌తో భారత్ ఆరవసారి అండర్-19 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.
తాజాగా బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ పలు విషయాలపై స్పందించాడు. 'రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడటం నా జీవితంలో కీలక మలుపు. ఆర్ఆర్ జట్టులో ఆడటం వల్ల నా ఆటలోనే కాదు, జీవితంలో కూడా మార్పు వచ్చింది. ఏ యువ ఆటగాడికైనా తొలి ఐపీఎల్ క్యాంప్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. నేనేం చేయగలనో దానిపైనే దృష్టి పెడతా. మైదానంలో బాగా ఆడితే మనపై అందరి అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే విమర్శిస్తారు. నేనెప్పుడూ విమర్శలను పట్టించుకోను. తొలిసారి నేను అండర్ 19 వరల్డ్ కప్ ఆడా. ఫైనల్‌లో సెంచరీ చేయడం ఎంతో గర్వంగా ఉంది. భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషం' అని వైభవ్ చెప్పాడు.
ఐపీఎల్ 2026లో ఆడబోతున్నా. ఈ సీజన్‌లో మా జట్టుకు ట్రోఫీ అందించడం నా ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును కూడా బద్దలు కొట్టాలని చూస్తున్నా' అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఐపీఎల్‌లో 175 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి 206.56 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. 35 బంతుల్లోనే సెంచరీ సాధించడం అతని కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఈ యువ సంచలనం ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.