Ustaad Bhagat Singh : బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ ఉస్తాద్ భగత్ సింగ్ ..పవన్ ఖాతాలో భారీ డిజాస్టార్
Ustaad Bhagat Singh : బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ ఉస్తాద్ భగత్ సింగ్ ..పవన్ ఖాతాలో భారీ డిజాస్టార్
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో లెక్కలు కాస్త తారుమారవుతున్నాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ముగిసేసరికి ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే 'గబ్బర్ సింగ్' రేంజ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. దానికి తగ్గట్టే 150 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని ఘనంగానే ప్రారంభించినా.. రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఆరంభం అదిరినా..
తొలిరోజు ఇండియాలో 34.75 కోట్ల భారీ నెట్ వసూళ్లతో ఉస్తాద్ పంజా విసిరాడు. కానీ, ఆ తర్వాత కలెక్షన్స్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఏడో రోజు నాటికి కేవలం 1.14 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మొత్తంగా మొదటి వారం ముగిసేసరికి ఇండియాలో 65.74 కోట్ల నెట్ (77.36 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు అక్కడ 11.3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే నమోదయ్యాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 137 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 50 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్లు అంటూ భారీ రేట్లకు హక్కులు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 140 కోట్ల షేర్ (సుమారు 280 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సినిమా 88.60 కోట్ల గ్రాస్.. 53 కోట్ల షేర్ వద్దే ఆగిపోయింది.
పరిస్థితి ఏంటి?
రెండో వారంలోకి అడుగుపెట్టిన 'ఉస్తాద్'కు థియేటర్ల వద్ద ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది. 8వ రోజు కేవలం 16 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ట్రేడ్ అంచనాల ప్రకారం, 8వ రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.50 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
డిజాస్టర్ దిశగా ఉస్తాద్
ప్రస్తుతం థియేటర్లలో 'ధురంధర్' సినిమా సునామీ సృష్టిస్తుండటం, దానికి తోడు 'ఉస్తాద్'కు మిక్స్‌డ్ టాక్ రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ నష్టాలను మిగిల్చే చిత్రంగా ఇది నిలిచిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినిమా గట్టెక్కాలంటే ఇంకా 87 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కొండంత లక్ష్యంగా కనిపిస్తోంది.