Rahul Ramakrishna: "ఆ విషం నా తమ్ముడిని బలితీసుకుంది.. ప్లీజ్ దాన్ని నిషేధించండి!": నటుడు రాహుల్ రామకృష్ణ ఆవేదన
Rahul Ramakrishna: ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు.
Rahul Ramakrishna: "ఆ విషం నా తమ్ముడిని బలితీసుకుంది.. ప్లీజ్ దాన్ని నిషేధించండి!": నటుడు రాహుల్ రామకృష్ణ ఆవేదన
Rahul Ramakrishna: ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. అత్యంత విషపూరితమైన ‘పారాక్వాట్’ (Paraquat) అనే కలుపు సంహారిణిని తక్షణమే నిషేధించాలని ఆయన కోరారు. ఈ రసాయనం వల్ల తన సొంత సోదరుణ్ని కోల్పోయానని చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత విషాదం.. సామాజిక ఆవేదన:
"మార్కెట్లో అతి తక్కువ ధరకే, సులభంగా దొరుకుతున్న ఈ విషం ఎందరో ప్రాణాలను బలిగొంటోంది. ఇది ఆత్మహత్యలకు ఒక సులభమైన మార్గంగా మారింది" అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం (PMO), తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (TG CMO) ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మృత్యుపాశంగా పారాక్వాట్:
సాధారణంగా రైతులు పొలాల్లో కలుపు మొక్కలను, గడ్డిని తొలగించడానికి ఈ రసాయనాన్ని వాడుతుంటారు. అయితే, ఇది దాదాపు ప్రతి రైతు ఇంట్లో అందుబాటులో ఉండటంతో.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలనుకునే వారికి ఇది శాపంగా మారుతోంది.
ఈ మందు కొద్ది మోతాదులో తాగినా ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి చేరగానే ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి కీలక అవయవాలను పూర్తిగా దెబ్బతీస్తుంది.
‘డాక్టర్స్ ఎగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్’ గణాంకాల ప్రకారం.. ఒక్క తెలంగాణలోనే ఏటా సుమారు 5,500 నుంచి 6,000 మంది ఈ విషం తాగి మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 1000 కేసులు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నిషేధించాలనే డిమాండ్:
ఇప్పటికే పలు దేశాల్లో నిషేధానికి గురైన ఈ రసాయనాన్ని భారత్‌లో కూడా నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ విక్రయించాల్సి వచ్చినా.. మండల వ్యవసాయ అధికారి సిఫార్సుతో, ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.