Dhurandhar 2 Mania: హాలీవుడ్ సినిమాకు దురంధర్ 2 దుమారం.. నో స్క్రీన్స్!
Dhurandhar 2 Mania: దురంధర్ 2 మూవీ దెబ్బకు హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అల్లాడిపోతోంది. మల్టీప్లెక్స్ లలో ఈ మూవీకి స్క్రీన్స్ దొరకలేదని చెబుతున్నారు.
Dhurandhar 2 Mania
Dhurandhar 2 మేనియా: రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' భారత బాక్సాఫీస్‌లో రికార్డులను బద్దలు కొడుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా బాక్సాఫీస్‌లో వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా వసూళ్లు రూ. 1000 కోట్లు దాటాయని చెబుతున్నారు. ప్రతిచోటా సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 'ధురందర్ 2' పై హైప్ బలంగా ఉంది. 'ధురందర్ 2' తో పోటీగా విడుదలైన చిత్రాలు దాని దాని దెబ్బకు కుదేలయిపోయాయి. వాటికి మొదట దొరికిన థియేటర్లే తక్కువ. ఉన్నవాటిలో కూడా కొన్ని షోలు ఇప్పుడు దురంధర్ 2 మూవీ వేస్తున్నారు. ప్రజల్లో వచ్చిన హైప్ కి ఇప్పుడప్పుడే దురంధర్ జోరు తగ్గేలా కనిపించడం లేదు. రెండోవారంలోకి అడుగుపెట్టినా అదే జోరుతో దూసుకుపోతోంది దురంధర్ 2.
హాలీవుడ్ మూవీకి స్క్రీన్స్ కరువు . .
ఇప్పుడు 'ధురందర్ 2' ఒక హాలీవుడ్ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఆ మూవీని భారత్ లో రిలీజ్ అవడానికి కూడా అడ్డంకిగా నిలిచింది. రయాన్ గోస్లింగ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారత్ లో కూడా ఈ మూవీ ఈరోజు (మార్చి 26) రిలీజ్ అయింది. సాధారణంగా, హాలీవుడ్ సినిమాలు మన దేశంలో విడుదలైనప్పుడు, వాటిని కేవలం మల్టీప్లెక్స్‌లలో మాత్రమే వేస్తారు. హాలీవుడ్ సినిమాలకు మల్టీప్లెక్స్ వినియోగదారులే ప్రధాన ప్రేక్షకులు. హాలీవుడ్ సినిమాలలో విఎఫ్ఎక్స్, దృశ్య నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల, ఆ చిత్రాలను ఐనాక్స్, పివిఆర్ వంటి బెస్ట్ సౌండ్, క్వాలిటీ ఉన్న స్క్రీన్లపై ప్రదర్శిస్తారు.
కానీ ప్రస్తుతం, భారతదేశంలోని మల్టీప్లెక్స్‌లలో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'కి స్క్రీన్‌లు దొరకడం లేదు. ఇది భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఒక అద్భుతమైన చిత్రం. ఇందులో విజువల్ వండర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయాలంటే, మీరు దానిని ఐమాక్స్ లేదా మరేదైనా అధిక క్వాలిటీ ఉన్న స్క్రీన్‌పై చూడాలి. కానీ 'ధురందర్ 2' భారతదేశంలోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్‌లను ఆక్రమించడంతో ఆ అవకాశం లేకుండా పోతోంది. రెండోవారంలోకి దురంధర్ 2 వచ్చినా.. ఇప్పటికీ స్క్రీన్స్ ఖాళీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. మరో మూడు నాలుగు వరాలు దురంధర్ 2 హల్ చల్ చేసే అవకాశం ఉంది. పైగా వీకెండ్ లో స్క్రీన్స్ అన్నీ దురంధర్ 2 కోసమే కేటాయించాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది. ఇప్పటికే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఏవో కొద్దీ షోలు తప్ప మిగిలినవి ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' స్క్రీన్‌ల కొరతను ఎదుర్కొంటోంది.
సీన్ రివర్స్ . .
ముఖ్యంగా, 'ప్రాజెక్ట్ హేమ్ మేరీ' సినిమా కోసం దేశవ్యాప్తంగా కేవలం నాలుగు ఐమాక్స్ స్క్రీన్లను మాత్రమే అందుబాటులో ఉంచారని చెబుతున్నారు. గతంలో హాలీవుడ్ సినిమాలు విడుదలైనప్పుడు, మల్టీప్లెక్స్‌లు తమ స్క్రీన్స్ లో ఉన్న భారతీయ సినిమాలను పక్కకు పెట్టేసి.. హాలీవుడ్ మూవీస్ కి దారి ఇచ్చేసేవి. కానీ, దురంధర్ 2కి సీన్ రివర్స్ అయింది. దాదాపుగా మన దేశంలో తొలిసారి హాలీవుడ్ సినిమాకు స్క్రీన్స్ నిరాకరించడం.. అదీ దురంధర్ 2 కారణంగా జరగడం విశేషం. ఇది దురంధర్ మూవీ స్టామినాను చెబుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దురంధర్ మూవీ ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ గా మారిపోయిన పరిస్థితి తీసుకువచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.