Water Fasting: కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉంటే ఏమవుతుంది? 'వాటర్ ఫాస్టింగ్' వల్ల కలిగే లాభనష్టాలివే!

కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉంటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వాటర్ ఫాస్టింగ్ వల్ల కలిగే ఆటోఫాగి, కీటోసిస్ ప్రయోజనాలు, ఇందులో ఉన్న రిస్కుల గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-25 07:22 GMT

Water Fasting: కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉంటే ఏమవుతుంది? 'వాటర్ ఫాస్టింగ్' వల్ల కలిగే లాభనష్టాలివే!

Water Fasting: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి రకరకాల డైట్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, జ్యూస్ క్లెన్స్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, వీటిలో 'వాటర్ ఫాస్టింగ్' అనే పద్ధతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'వాటర్ ఫాస్టింగ్' అంటే నిర్ణీత సమయం వరకు (సాధారణంగా 24 నుంచి 72 గంటలు) ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉండటం. ఇలా చేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శరీరంలో ఏం జరుగుతుందంటే..

వాటర్ ఫాస్టింగ్ సమయంలో మన శరీరం మూడు దశల్లో స్పందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే.. మొదటి 12 గంటలు శరీరంలో నిల్వ ఉన్న గ్లూకోజ్‌ను శక్తి కోసం వాడుకుంటుంది. తర్వాత 12 నుంచి 24 గంటలు వరకు శరీరం 'కీటోసిస్' మోడ్‌లోకి ప్రవేశిస్తుంది. అంటే నిల్వ ఉన్న కొవ్వును కరిగించి శక్తిని పొందడం ప్రారంభిస్తుంది. 24 గంటల తర్వాత 'ఆటోఫాగి' ప్రక్రియ మొదలవుతుంది. అంటే శరీరంలోని పాడైపోయిన కణాలను శుభ్రం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి శరీరం సిద్ధమవుతుంది.

ప్రయోజనాలు ఇవే..

ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, లెప్టిన్ హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. క్యాలరీల లోటు ఏర్పడటం వల్ల శరీరం మొండి కొవ్వును కరిగించడానికి మొగ్గు చూపుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ (మంట) వంటి సమస్యలను తగ్గించి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా శరీరం ఇతర కణాల మరమ్మత్తులపై దృష్టి పెట్టగలదు. ఈ ఉపవాసం వల్ల మెదడులో స్పష్టత పెరుగుతుంది, మానసిక ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని కొందరు చెబుతుంటారు.

రిస్కులు ఉన్నాయి.. జాగ్రత్త..

వాటర్ ఫాస్టింగ్ అందరికీ సరిపడదు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీరసం, తల తిరగడం, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రావచ్చు. మజిల్ మాస్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, తక్కువ బరువు ఉన్నవారు ఈ పద్ధతికి దూరంగా ఉండాలి. "ఫాస్టింగ్ అనేది మెటబాలిక్ ప్రక్రియను మెరుగుపరిచే ఒక సాధనం మాత్రమే, అది మంత్రదండం కాదు. ఏదైనా కొత్త డైట్ పద్ధతిని అనుసరించే ముందు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి" అని నిపుణులు స్పష్టం చేశారు.

గమనిక: ఈ సమాచారం అంతా కేవలం సాధారణ సమాచారం మాత్రమే. పూర్తి వివరాల కోసం ఒక వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Tags:    

Similar News