Skin Infections : పదేపదే చర్మ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త!

Skin Infections : మీకు పదేపదే చర్మ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి లేదా ఎగ్జిమాకు సంకేతం కావచ్చు. ఈ వ్యాధి లక్షణాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నివారణ మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-24 10:57 GMT

Skin Infections : పదేపదే చర్మ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త!

Skin Infections : వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు చర్మంపై దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్లు రావడం సహజం. అయితే, ఇవి పదేపదే వేధిస్తుంటే మాత్రం తేలికగా తీసుకోకూడదని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం వచ్చే చర్మ సమస్యలు శరీరంలోని ఇతర అంతర్గత అనారోగ్యాలకు సంకేతం కావచ్చని వారు వివరిస్తున్నారు. పదేపదే వచ్చే చర్మ ఇన్ఫెక్షన్లు ఏ వ్యాధికి సంకేతమూ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి తగ్గిందనడానికి సంకేతం..

చర్మ ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ రావడం అనేది మీ శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతోందనడానికి ఒక ప్రధాన గుర్తు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వెల్లడించారు. చర్మం పొడిబారి, తీవ్రమైన దురదకు గురిచేసే 'ఎగ్జిమా' వల్ల కూడా ఇన్ఫెక్షన్లు పదేపదే వస్తుంటాయని అన్నారు. ఇది సాధారణంగా చాలా మందిలో కనిపించే సమస్యే అయినప్పటికీ, దీనిని నయం చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్సను మధ్యలో ఆపకుండా కొనసాగించడం వల్ల దీనిని నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.

మీ చర్మంపై కింది మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..

* ఆగకుండా చర్మం దురద పెట్టడం.

* ఎర్రటి దద్దుర్లు రావడం.

* చర్మం రంగు మారి నల్లబడటం లేదా గట్టిపడటం.

* చర్మం విపరీతంగా పొడిబారడం.

నివారణ మార్గాలు ఇవే..

చర్మ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడంతో పాటు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని, ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్నవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరం అని సూచించారు.

Tags:    

Similar News