Stomach Health: గ్యాస్, కడుపునొప్పిని లైట్ తీసుకుంటున్నారా? జాగ్రత్త! ఈ 4 టెస్టులు చేయించుకోండి
Stomach Health: మారుతున్న జీవనశైలి కారణంగా నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య పొట్ట సంబంధిత వ్యాధులు. గ్యాస్, అజీర్తి లేదా కడుపునొప్పిని సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో అవి తీవ్రమైన ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Stomach Health: గ్యాస్, కడుపునొప్పిని లైట్ తీసుకుంటున్నారా? జాగ్రత్త! ఈ 4 టెస్టులు చేయించుకోండి
Stomach Health: ఉరుకుల పరుగుల జీవితం, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ్యాస్, కడుపు నొప్పి లేదా అజీర్తిని ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ, ఇవి భవిష్యత్తులో వచ్చే పెద్ద అనారోగ్యాలకు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ భవిష్యత్తులో ఆ పెద్ద అనారోగ్యాలు ఏంటి, వాటిని రాకుండా నివారించడానికి ఏం చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మన పొట్ట ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి '4C' ఫార్ములా ఎంతో కీలకం అని నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగు పరీక్షల రిపోర్టులు గనుక నార్మల్‌గా వస్తే, మీకు పొట్టకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు ఏవీ లేవని నిర్ధారించుకోవచ్చ పేర్కొన్నారు.
'4C' ఫార్ములా అంటే?
పొట్ట సమస్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడానికి నిపుణులు ఈ క్రింది నాలుగు పరీక్షలను సూచిస్తున్నారు.. వాటినే '4C' ఫార్ములాగా పేర్కొన్నారు. అందులో మొదటిది.. CBC (కంప్లీట్ బ్లడ్ కౌంట్). ఈ పరీక్ష ద్వారా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను, ఇన్ఫెక్షన్లను గుర్తించ వచ్చు. రక్తహీనత లేదా ఇన్ఫెక్షన్ ఉంటే అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండవ పరీక్ష.. CRP (సి-రియాక్టివ్ ప్రోటీన్). ఇది చేయించుకోవడం ద్వారా శరీరంలో ఎక్కడైనా వాపు ఉందా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పేగుల్లో వాపు ఉన్నప్పుడు CRP స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే మూడవది..
కాల్‌ప్రొటెక్టిన్ (Calprotectin).. ఇది మల పరీక్ష (Stool Test). పేగుల్లో ఏవైనా పుండ్లు లేదా తీవ్రమైన వాపు ఉందో లేదో ఈ పరీక్ష స్పష్టం చేస్తుంది. తరచూ విరేచనాలు, కడుపునొప్పితో బాధపడేవారికి ఇది చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ '4C' ఫార్ములాలో చివరిది.. సీలియాక్ సెరాలజీ (Celiac Serology).. ప్రస్తుతం దేశంలో గ్లూటెన్ అలర్జీ సమస్య పెరుగుతుంది. ఇది గోధుమల వల్ల వచ్చే సమస్య అని నిపుణులు పేర్కొన్నారు. మీ శరీరం గ్లూటెన్‌ను తట్టుకోగలుగుతుందో లేదో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుందని వివరించారు.
ఒకవేళ పైన పేర్కొన్న నాలుగు పరీక్షల ఫలితాలు నార్మల్ ఉండి, అయినా సరే మీకు కడుపులో అసౌకర్యంగా ఉంటే, దానిని IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) గా పరిగణిస్తారని నిపుణులు వెల్లడించారు. IBS అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఇది ఒక ఫంక్షనల్ డిజార్డర్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమబద్ధమైన జీవనశైలి ద్వారా దీనిని సులభంగా నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అందుకే, పొట్ట సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనవసరమైన ఆందోళనల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు.