డాక్టర్ సలహా లేకుండా ఈ విటమిన్ తీసుకుంటే ప్రమాదం… కంటి చూపు పోయే అవకాశాలు
Vitamin B3 Side Effects on Eyes: శరీరంలో విటమిన్ లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే చాలామంది ప్రతిరోజూ విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటుంటారు.
Vision Loss due to Vitamins
మన శరీరం సక్రమంగా పనిచేయడానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. శరీరంలో విటమిన్ లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే చాలామంది ప్రతిరోజూ విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. అయితే ఓ విటమిన్ నిపుణుల సలహా లేకుండా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
విటమిన్ B3 (నియాసిన్)
విటమిన్ B3ను నియాసిన్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే హై కొలెస్ట్రాల్ లేదా హైపర్‌లిపిడీమియా ఉన్నవారికి డాక్టర్లు కొన్నిసార్లు ఈ విటమిన్ తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఇది సరైన మోతాదులోనే తీసుకోవాలి.
అధిక మోతాదులో తీసుకుంటే వచ్చే సమస్య
అమెరికాలోని న్యూయార్క్ ఐ అండ్ ఇయర్ ఇన్‌ఫర్మరీ ఆఫ్ మౌంట్ సీనైకు చెందిన వైద్యులు ఒక ఆసక్తికరమైన కేసును వెల్లడించారు. 61 సంవత్సరాల వ్యక్తి కంటి చూపు ఒక్క నెలలోనే బాగా తగ్గిపోయింది. అతనికి స్పష్టంగా కనిపించకపోవడంతో పరీక్షలు నిర్వహించగా, కంటి చూపు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు తెలిసింది.
అసలు కారణం ఏమిటి?
పరీక్షల సమయంలో మొదట ఆ వ్యక్తి తనకు హై బీపీ, హై కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అయితే తర్వాత అతను కొన్ని నెలలుగా ప్రతిరోజూ 3 నుంచి 6 గ్రాముల వరకు నియాసిన్ తీసుకుంటున్నట్లు ఒప్పుకున్నాడు. ఇది అతను డాక్టర్ సలహా లేకుండా స్వయంగా కొనుగోలు చేసి తీసుకోవడం ప్రారంభించాడు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించి ఇలా చేసినట్లు తెలిపాడు.
కంటి సమస్య ఎలా ఏర్పడింది?
వైద్యులు అతని కళ్లను పూర్తిగా పరీక్షించినప్పుడు ‘నియాసిన్ ఇండ్యూస్‌డ్ సిస్టాయిడ్ మాక్యులోపతి’ అనే అరుదైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో కంటి రెటినా లోని మాక్యులా భాగంలో ద్రవం చేరి వాపు వస్తుంది. దీంతో చూపు మసకబారడం లేదా బలహీనపడడం జరుగుతుంది. మంచి విషయం ఏమిటంటే, అతను నియాసిన్ తీసుకోవడం ఆపిన తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగైంది. ఒక వారం లోపే చూపు మెరుగుపడడం ప్రారంభమైంది. రెండు నెలల తర్వాత అతని చూపు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది.
నిపుణుల హెచ్చరిక
వైద్యుల ప్రకారం నియాసిన్ సాధారణంగా రోజుకు 1 నుంచి 3 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవాలి. గరిష్టంగా 6 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవచ్చు. అయితే ఇది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలి. ఆ వ్యక్తి మాత్రం వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో తీసుకున్నాడు. ఆధునిక ఇమేజింగ్ పరీక్షలలో అతని కంటి మాక్యులా భాగంలో వాపు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై చేసిన అధ్యయనం జర్నల్ ఆఫ్ విట్రియోరెటినల్ డీసిసెస్‌లో ప్రచురించారు. పరిశోధన బృందం హెడ్ డాక్టర్ రిచర్డ్ రోసెన్ ప్రకారం, డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.