Tuberculosis symptoms: సాధారణ దగ్గు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అది టీబీ కావచ్చు.. జాగ్రత్త!

Tuberculosis symptoms: సాధారణ దగ్గు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అది టీబీ కావచ్చు.. జాగ్రత్త!రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు ఉండే దగ్గును అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా, టీబీ స్టార్టింగ్ లక్షణాలు, రోగ నిర్ధారణ పరీక్షలు, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, ఒకవేళ వ్యాధి నిర్థారణ అయితే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-23 11:35 GMT

Tuberculosis symptoms: సాధారణ దగ్గు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అది టీబీ కావచ్చు.. జాగ్రత్త!

Tuberculosis symptoms:ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ క్షయవ్యాధి (TB) నివారణ దినోత్సవం' నిర్వహిస్తారు. ప్రాణాంతకమైన ఈ అంటువ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. నేటికీ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. అయితే, టీబీ లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే ఈ వ్యాధి విజృంభించడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు అలర్ట్ అవ్వాలంటే..

ఈ వ్యాధి లక్షణాలపై పలువురు వైద్య నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. సాధారణ దగ్గుకు, టీబీకి మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం అని సూచించారు. మీకు దగ్గు ప్రారంభమై రెండు వారాలు దాటినా తగ్గకపోతే, దానిని సాధారణ దగ్గుగా భావించకూడదని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. దగ్గినప్పుడు కఫం పడటం, మరీ ముఖ్యంగా కఫంతో పాటు రక్తం పడటం టీబీకి ప్రధాన సంకేతం అని వెల్లడించారు. ఎలాంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం కూడా టీబీకి లక్షణాలు అని చెప్పారు. శ్వాస తీసుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి రావడాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.

టీబీ వ్యాధి ప్రారంభ దశలో చాలా నెమ్మదిగా ప్రభావం చూపుతుందని, దీనివల్ల అనేక మంది రోగులు తాము బాగున్నాము కదా అని భ్రమపడతారని డాక్టర్లు వివరించారు. అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వైద్యుడి దగ్గరకు వెళ్లడంలో ఆలస్యం చేస్తారని, దీనివల్ల ఆ వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. ఒకవేళ మీకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే పల్మనాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచించారు. వారు ప్రధానంగా ఈ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారని వెల్లడించారు. ఛాతీ ఎక్స్-రే, కఫం పరీక్ష, రక్త పరీక్షలు..

ఒకవేళ మీకు టీబీ అని నిర్ధారణ అయితే భయపడాల్సిన అవసరం లేదని, వైద్యులు సూచించిన మందుల కోర్సును (సాధారణంగా 6 నెలల నుంచి ఏడాది వరకు) క్రమం తప్పకుండా వాడితే టీబీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. మధ్యలోనే మందులు ఆపేయడం వల్ల వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. "టీబీని అంతం చేద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం" అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెనుకాడకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News