Heart Failure: పాదాల్లో ఈ మార్పులా.? గుండె స‌మ‌స్య‌లకు సంకేతం కావొచ్చు.

Heart Failure: మన శరీర ఆరోగ్యం గురించి కొన్ని చిన్న చిన్న సంకేతాలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. వాటిని పట్టించుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు.

Update: 2026-03-24 10:36 GMT

Heart Failure: పాదాల్లో ఈ మార్పులా.? గుండె స‌మ‌స్య‌లకు సంకేతం కావొచ్చు.

Heart Failure: మన శరీర ఆరోగ్యం గురించి కొన్ని చిన్న చిన్న సంకేతాలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. వాటిని పట్టించుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. అలాంటి సంకేతాల్లో ఒకటి కాళ్లు లేదా మడమలు తరచూ ఉబ్బడం. చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు సూచన కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి?

హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండె కండరాలు శరీరమంతా రక్తాన్ని సరైన విధంగా పంపించలేని పరిస్థితి. గుండె పనితీరు బలహీనపడితే రక్త ప్రవాహం మందగిస్తుంది. దాంతో శరీరంలో ద్రవం (ఫ్లూయిడ్) నిల్వ కావడం మొదలవుతుంది. ఈ ద్రవం కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లో కూడిపోవచ్చు. అప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. గుండె ఆరోగ్యం బాగాలేదని తెలిపే కొన్ని లక్షణాలు ముందే కనిపిస్తాయి. వాటిలో మడమలు, కాళ్లు ఉబ్బడం కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు.

కాళ్లు, మడమలు ఎందుకు ఉబ్బుతాయి?

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వివరాల ప్రకారం మడమలు లేదా కాళ్లు తరచూ ఉబ్బడం హార్ట్ ఫెయిల్యూర్ సంకేతం కావచ్చు. వైద్య భాషలో ఈ పరిస్థితిని ఎడిమా (Edema) అని అంటారు. శరీర టిష్యూల్లో ద్రవం ఎక్కువగా నిల్వ కావడం వల్ల ఈ వాపు ఏర్పడుతుంది. సాధారణంగా ఇది కాళ్లు, మడమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో ఉదయం వాపు తక్కువగా ఉండి, రోజంతా క్రమంగా పెరుగుతుంది. గుండె రక్తాన్ని బలంగా పంపించలేకపోతే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ద్రవం బయటకు వచ్చి చుట్టూ ఉన్న టిష్యూల్లో చేరి వాపు కనిపిస్తుంది.

ఎడిమా వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు

ఎడిమా వచ్చినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మడమలు, కాళ్లు లేదా కాళ్ల కండరాల్లో వాపు, చర్మం గట్టిగా లేదా మెరుస్తున్నట్లు కనిపించడం, వాపు ఉన్న చోట నొక్కితే గుంత పడటం, నొప్పి లేదా గట్టిగా ఉన్న భావన క‌ల‌గ‌డం.

అయితే కాళ్లు ఉబ్బడం ప్రతి సారి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగానే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడడం, ఎక్కువ ఉప్పు తినడం, స్థూలకాయం, గర్భధారణ, కొన్ని మందులు వాడటం, గాయాలు, కిడ్నీ లేదా లివర్ సమస్యలు కూడా వాపుకు కారణమవుతాయి.

హార్ట్ ఫెయిల్యూర్ సమయంలో కనిపించే ఇతర లక్షణాలు

హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే కేవలం కాళ్ల వాపే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా కనిపించవచ్చు.

చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్ప‌డ‌డం, గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం, వ్యాయామం చేసే శక్తి తగ్గిపోవడం, దగ్గు లేదా ఊపిరిలో శబ్దం, కడుపు ఉబ్బరం, అకస్మాత్తుగా బరువు పెరగడం, వాంతుల భావన లేదా ఆకలి తగ్గడం, దృష్టి, ఏకాగ్రత తగ్గడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఛాతిలో నొప్పి కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా హార్ట్ అటాక్ ప్రమాదం ఉన్నప్పుడు ఈ లక్షణం ఉంటుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

కొన్ని వ్యక్తుల్లో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలి, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు దీనికి కారణమవుతాయి. 65 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో, ధూమపానం లేదా మద్యం అల‌వాటు ఉన్న వారిలో, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, అధిక రక్తపోటు, కుటుంబంలో గుండె సమస్యల చరిత్ర ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు వైద్యులకు ప్ర‌త్యామ్నాయం కాద‌ని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

Tags:    

Similar News