Health: స్ట్రోక్ వచ్చే వారం ముందు కనిపించే లక్షణాలు ఇవే.. అస్సలు లైట్ తీసుకోకండి
Health: స్ట్రోక్ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా తగ్గిపోయినా లేదా ఆగిపోయినా స్ట్రోక్ సంభవిస్తుంది.
Health: స్ట్రోక్ వచ్చే వారం ముందు కనిపించే లక్షణాలు ఇవే.. అస్సలు లైట్ తీసుకోకండి
Health: స్ట్రోక్ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా తగ్గిపోయినా లేదా ఆగిపోయినా స్ట్రోక్ సంభవిస్తుంది. వెంటనే చికిత్స అందకపోతే కొద్ది నిమిషాల్లోనే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే స్ట్రోక్ వచ్చే కొన్ని రోజులు ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
అసాధారణంగా తలనొప్పి
స్ట్రోక్‌కు ముందు వచ్చే తలనొప్పి సాధారణ తలనొప్పి లాగా ఉండదు. ఇది ఒక్కసారిగా ప్రారంభమవుతుంది. చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చాలా సమయం పాటు తగ్గకుండా కొనసాగుతుంది. ఈ తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతులు రావడం, కళ్ల ముందు మసకగా కనిపించడం వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. సాధారణంగా తలనొప్పి మందులు తీసుకున్నా తగ్గకపోవచ్చు. ఇది మెదడులో ఒత్తిడి పెరగడం లేదా రక్తస్రావం ప్రారంభ సంకేతంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
శరీరంలోని ఒక భాగంలో బలహీనత లేదా మొద్దుబారడం
స్ట్రోక్‌కు ముందుగా కనిపించే ముఖ్యమైన సంకేతాలలో ఇది ఒకటి. ముఖం, చేతి లేదా కాలి భాగంలో ఒక్కసారిగా బలహీనపడడం, లేదా మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఇది ఎక్కువగా శరీరం ఒకే వైపున కనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య కొద్దిసేపటికి తగ్గిపోతుంది. అందుకే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా తగ్గుతున్న సంకేతం కావచ్చు. అలాంటి లక్షణాలు తరచుగా వస్తే తప్పకుండా వైద్య పరీక్ష చేయించుకోవాలి.
మాట్లాడటంలో లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
స్ట్రోక్‌కు ముందు కొందరికి మాటలు సరిగా రావడం కష్టంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం లేదా సరైన పదం గుర్తు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇతరులు చెప్పే మాటలు అర్థం చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. వ్యక్తి తాను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని కూడా గుర్తించవచ్చు. ఇది మెదడులో భాష, ఆలోచనలను నియంత్రించే భాగం ప్రభావితమవుతున్న సంకేతం కావచ్చు. అందుకే దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
చూపునకు సంబంధించిన సమస్యలు
ఒక్కసారిగా కళ్లకు మసకగా కనిపించడం, డబుల్‌గా కనిపించడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం లేదా ఒక కన్నుతో సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కూడా స్ట్రోక్‌కు ముందు కనిపించవచ్చు. కొన్నిసార్లు చూసే పరిధి కూడా తగ్గుతుంది. ఇది “మినీ స్ట్రోక్” లేదా ట్రాన్సియెంట్ ఇస్కేమిక్ అటాక్ అనే పరిస్థితికి సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి తర్వాత పెద్ద స్ట్రోక్‌గా మారే ప్రమాదం ఉంటుంది.
తల తిరగడం, నడవడంలో అసమతుల్యత
ఎలాంటి కారణం లేకుండా తరచుగా తల తిరగడం, నడుస్తూ ఉండగా తడబడటం లేదా శరీర సమతుల్యత కోల్పోవడం కూడా స్ట్రోక్‌కు ముందస్తు సంకేతంగా భావించవచ్చు. మెదడులో శరీర సమతుల్యతను నియంత్రించే భాగాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు ఈ సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
స్ట్రోక్ నుంచి ఎలా జాగ్రత్తపడాలి?
స్ట్రోక్‌ను చాలా సందర్భాల్లో సరైన జీవనశైలితో నివారించవచ్చు. ముఖ్యంగా రక్తపోటును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. అందుకే తరచుగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సూచించిన మందులు సమయానికి తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ధూమపానం పూర్తిగా మానేయాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు డాక్టర్ల సూచనలు పాటించడమే ఉత్తమం.