Miss World 2025 pageant in Hyderabad: అందాల పోటీల చరిత్ర తెలుసా?

మిస్ వరల్డ్ 2025 పోటీలను 2025 మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 140 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.

Update: 2025-03-20 11:33 GMT

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలు: అందాల పోటీల చరిత్ర తెలుసా?

మిస్ వరల్డ్ 2025 పోటీలను 2025 మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 140 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.

నెల రోజుల పాటు అందాల పోటీల ఈవెంట్

మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా ఈ పోటీల్లో పాల్గొనేవారు సందర్శిస్తారు.రామప్ప, బుద్దవనం, భూధాన్ పోచంపల్లి, కుంటల జలపాతం, ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, కాళేశ్వరం, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు గ్రూపులుగా విభజించి పోటీదారులను తీసుకెళ్తారు. తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది ఒక అవకాశమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

మిస్ వరల్డ్ పోటీలు ఎలా ప్రారంభమయ్యాయి?

మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభించారు. యుకెలోని ఎరిక్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీలను స్టార్ట్ చేశారు. 2000లో ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య జూలియా మోరీ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పేరును ట్రేడ్ మార్కుగా నమోదు చేసుకున్నారు. మోర్లీ యుకెలోని ఓ టీవీ ఛానెల్ లో పనిచేసేవారు. 1951లో బ్రిటన్ ఫెస్టివల్ వేడుకల్లో భాగంగా బికినీ పోటీ నిర్వహించారు. దీన్ని ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచారు. ఇవి మిస్ వరల్డ్ ‌ పోటీలుగా మీడియాలో ప్రాచుర్యం పొందాయి. 1959లో బీబీసీలో ఈ పోటీని ప్రసారం చేశారు. 1951లో స్వీడన్ దేశానికి చెందిన కికిహకన్సన్ తొలి మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు. 1960, 1970లో బ్రిటిష్ టెలివిజన్‌లో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా ఇది పేరొందింది.

1970లలో లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలను నిరసనకారులు అడ్డుకున్నారు. 1976లో మిస్ వరల్డ్ పోటీల్లో స్విమ్ సూట్ స్థానంలో సాయంత్రం గౌన్లు వచ్చాయి.ప్రపంచంలో జరిగే అతి పెద్ద పోటీల్లో ఇది ఒకటి. 1951 నుంచి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వికలాంగులు, వెనుకబడిన పిల్లలకు సహాయపడే స్వచ్ఛంధ సంస్థల కోసం 1 బిలియన్ యూరోల కంటే ఎక్కువ నిధులను సేకరించింది.1980లో ఏ బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. తెలివితేటలు, వ్యక్తిత్వ పరీక్షలను ఈ పోటీల్లో చేర్చారు.

మిస్ యూనివర్స్ పోటీలు ఎలా ప్రారంభమయ్యాయి?

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యాపారవేత్త మిస్ యూనివర్స్ పోటీలను 1952లో ప్రారంభించారు. బ్రిటన్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించిన ఏడాది తర్వాత మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు పోటీలు ఒకే తరహాలో ఉంటాయి. కానీ, వేర్వేరు సంస్థలు ఈ పోటీలను నిర్వహిస్తాయి. మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి ప్రతి దేశంలో ఒక సంస్థ ప్రాంచైజీని కొనుగోలు చేస్తారు. అలాగే మిస్ వరల్డ్ పోటీలకు కూడా స్థానిక ఫ్రాంచైజీ ఉంటుంది. మిస్ యూనివర్స్ కిరిటాన్ని ఫిన్ లాండ్ కు చెందిన ఆర్మీ కుసేలా దక్కించుకున్నారు.

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలను దక్కించుకున్న భారతీయులు

1966లో భారత్ కు చెందిన రీటా ఫారియా తొలిసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997 లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు గెలిచారు.

Tags:    

Similar News