Hyderabad Rain Updates: ఆకాశానికి చిల్లు పడినట్లుగా భారీ వర్షం.. నేలకొరిగిన చెట్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు
Hyderabad Rain Updates: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరగంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hyderabad Rain Updates
Hyderabad Rain Updates: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరగంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్ - వరంగల్ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మేడిపల్లి వద్ద రోడ్డుపై మోకాళ్ళ లోతు నీరు నిలిచింది.
బోయినపల్లి, ఎస్‌ఆర్ నగర్‌లో నిన్న కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగిపడడంతో విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డుకి అడ్డంగా చెట్లు విరిగిపడడంతో, వైర్లు తెగిపడటం వంటి ఘటనలు అక్కడక్కడా కనిపించాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని కాలనీ వాసులే రోడ్లను బ్లాక్ చేశారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షానికి కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, అక్కడి రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. నీరు నిలిచిన ప్రాంతాలను DRF, GHMC బృందాలు పరిశీలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షానికి మూసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రేపటిలోగా ఈ నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోళ్లపడకల్‌లోని పతేసాగర్ చెరువు నిండి పొంగి పొర్లుతోంది. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో.. రాకపోవకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ధాటికి కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో భారీ వృక్షం కూలి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ పోల్ సైతం విరిగిపడింది. అయితే, అదృష్టవశాత్తుగా ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభం విరిగిపోవడంతో విద్యుత్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది సర్వీస్ రోడ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ కీసర మండలం పరిధి రాంపల్లి నుండి చర్లపల్లి వెళ్లే రహదారి వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతోంది. దీంతో ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు తాత్కాలికంగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే వాహదారులు, అక్కడి స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
సికింద్రాబాద్ అడ్డగుట్టలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కారు, ఆటోలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. సకాలంలో ఆటోలో నుండి ప్రయాణికులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి జిహెచ్ఎంసీ అధికారుల బృందం, పోలీసులు చేరుకొని చెట్టును తొలగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను మరో దారిగుండా మళ్లించారు. చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా కుత్బుల్లాపూర్‌లోని అనేక ప్రాంతాలు, కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. అక్కడి జనం అత్యవసర పరిస్థితుల్లోనూ ఇళ్ల నుండి బయటికి రావాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 లో ఓ భారీ చెట్టు నేలకొరిగింది. అయితే అదృష్టవశాత్తుగా ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుండి రిపోర్ట్స్ తెప్పించుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో తప్పించి ఎవ్వరూ బయటికి రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.