Hyderabad Weather: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షం..
Hyderabad Weather: హైదరాబాద్ లోని బాలానగర్, బోయిన్ పల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మరికొన్ని ప్రాంతాల్లో దురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి.
Hyderabad Weather
Hyderabad Weather: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు వేడిగా ఉన్నా వాతావరణం.. చీకటి పడగానే భారీ వర్షంతో తడిసి మద్దయింది. చార్మినార్ జోన్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన తాజా ప్రెస్ రిలీజ్‌లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఐసోలేటెడ్ ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, కొన్ని వేళల్లో 50 కి.మీ వరకు గాలివేగం ఉండొచ్చని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరో రెండో రోజులు ఇదే పరిస్థితి..
మార్చి 17, 18 తేదీల్లో కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17 నుంచి కొన్ని ప్రాంతాల్లో, మార్చి 18 నుంచి మరింత విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన వానలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 18, 19 తేదీల్లో తెలంగాణ అన్ని జిల్లాల్లో ఐసోలేటెడ్ ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో, 60 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి.
ప్రజలకు సూచనలు..
వర్షం, మెరుపులు, ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో అవసరం లేకపోతే భారీ చెట్ల కింద, బలహీనమైన నిర్మాణాల పక్కన నిలవకూడదు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున గొడుగు లేదా రైన్ ప్రొటెక్షన్ వెంట తీసుకెళ్లడం మంచిది. నగరంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అధికారిక హెచ్చరికలను గమనిస్తూ ఉండటం అవసరం.