Maheshwar Reddy: ప్రజా సమస్యలపై చర్చకు భయం.. అందుకే అసెంబ్లీ కోత

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీజేపీ శాసనసభ పక్ష నేత (BJLP) ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-03-16 10:07 GMT

Maheshwar Reddy: ప్రజా సమస్యలపై చర్చకు భయం.. అందుకే అసెంబ్లీ కోత

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీజేపీ శాసనసభ పక్ష నేత (BJLP) ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం సమావేశాల రోజులను కుదిస్తోందని ఆరోపించారు.

30 రోజులు నిర్వహించాల్సిందే!

బీఏసీ (BAC) సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. "కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మేము కోరాం. కానీ, ప్రభుత్వం కేవలం ఐదారు రోజుల్లోనే బడ్జెట్‌పై చర్చ ముగించి, తూతూమంత్రంగా ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు" అని మండిపడ్డారు.

గవర్నర్ ప్రసంగంపై విమర్శలు

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం నిరాశాజనకంగా ఉందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం పేదవాడికి భరోసా ఇచ్చేలా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కకు మించిన లక్షలాది రూపాయల అప్పులు చేస్తోందని, కానీ ఆ అప్పుల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారనే అంశంపై బీఏసీ సమావేశంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తంగా గవర్నర్ ప్రసంగంలో పస లేదని, ప్రభుత్వం చర్చల నుంచి పారిపోవాలని చూస్తోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News