Warangal Municipal Elections: అదృష్టం ‘హస్త’మే: లాటరీలో కాంగ్రెస్‌కు దక్కిన జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలు.. ఉత్కంఠకు తెర!

Warangal Municipal Elections: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.

Update: 2026-02-17 08:36 GMT

Warangal Municipal Elections: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు రెండు చోట్లా బలాబలాలు సమానం కావడంతో అధికారులు లాటరీ (Lucky Dip) నిర్వహించారు. ఈ లాటరీలో అదృష్టం కాంగ్రెస్ వైపు నిలవడంతో ఆ రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

జనగామలో ఉత్కంఠ భరితం:

జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను..

బీఆర్ఎస్ బలం: 13 వార్డులు + ఇద్దరు స్వతంత్రుల మద్దతు + ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో మొత్తం 16కు చేరింది.

కాంగ్రెస్ బలం: 13 వార్డులు (సీపీఎం మిత్రపక్షంతో కలిపి) + ఇద్దరు స్వతంత్రులు + ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో మొత్తం 16కు చేరింది. ఇరు పార్టీల బలం సరిసమానం కావడంతో అధికారులు లాటరీ తీయగా, కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో చైర్మన్ పీఠం హస్తగతమైంది.

తొర్రూర్‌లోనూ అదే సీన్:

తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా..తొలుత బీఆర్ఎస్ 9 వార్డుల్లో, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలిచాయి. అయితే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యల ఎక్స్‌అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కు పెరిగింది. ఇక్కడ కూడా రెండు పార్టీల బలం 9-9గా మారడంతో లాటరీ నిర్వహించారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి విజేతగా నిలిచారు.

ఎక్స్‌అఫీషియో ఓట్ల సమీకరణాలు, లాటరీ అదృష్టంతో రెండు మున్సిపాలిటీలు దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

Tags:    

Similar News