కేసీఆర్ అహంకారం దారిలోకి వస్తోంది: విజయశాంతి

Update: 2020-12-31 12:29 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గడిచిన ఆరేళ్ల పాలనలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు దృష్టిసారిస్తుండటం వెనుక కుట్ర ఉందన్నారు. తాజాగా కేసీఆర్ చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటే అన్నారు. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ మార్చేయాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విజయశాంతి అన్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే కేసీఆర్ అహంకారాన్ని కొంత దారికి తెచ్చాయన్నారు విజయశాంతి. ఆ ఫలితాల ప్రభావంతోనే ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గారన్నారు. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాలే వస్తే సీఎం కేసీఆర్ ఎంతో కొంత జనసంక్షేమం గురించి ఆలోచిస్తారన్నారు. ఇప్పటికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్ మెంట్ ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి ప్రయత్నం చేస్తారని అభిప్రాయపడ్డారు. ఇక ప్రతి సందర్భంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి రుచి చూపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.



 


Tags:    

Similar News