TSRTC: మహిళల కోసం ఆర్టీసీ బంపర్ ఆఫర్స్

TSRTC: ఉమెన్స్ డే సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ

Update: 2022-03-08 02:30 GMT

TSRTC: మహిళల కోసం ఆర్టీసీ బంపర్ ఆఫర్స్

TSRTC: అతివలను ఆకట్టుకొనేలా నయా ఆఫర్‌తో తెలంగాణ ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఉమెన్స్ డే సందర్బంగా మహిళలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పండుగలు, జాతరలు సహా కొన్ని ప్రత్యేక సమయాల్లో జనం దృష్టిని తనవైపు తిప్పుకొనేలా ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తుంది. హైదరాబాద్‌లోని మహిళా ప్రయాణీకుల కోసం రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు 8వ తేదీన ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.

రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో మహిళా వ్యాపారులు, డ్వాక్రా గ్రూప్‌ల ద్వారా ఉత్పత్తుల సేల్స్ కోసం ఉచిత స్టాల్స్, స్పేస్‌ను అందించాలని సంస్థ నిర్ణయించింది. అంతేకాక మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థల్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇప్పించనున్నారు. అయితే ఈ సౌకర్యం పొందాలనుకొనే మహిళా అభ్యర్థినులకు తప్పనిసరిగా ఎల్.ఎం.వీ లైసెన్స్, రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఇక గ్రేటర్ పరిధిలో డేలీ పాస్ అయిన టీ-24 టిక్కెట్ పై మార్చి 8 నుంచి 14 వరకూ 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. వరంగల్‌లోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లుల కోసం రెండు సీట్లను కేటాయించనుంది. మహిళలకు లక్కీ డ్రా సదుపాయం కూడా కల్పించారు. బస్ స్టేషన్లలలో ఏర్పాటు చేసిన పర్పుల్ కలర్ డ్రాప్ బాక్స్ లలో టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి వేయాలి. 31వ తేదీ వరకు ఈ అవకాశం ఉండగా ఏప్రిల్ 2వ తేదీన లక్కీ డ్రా తీయనున్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో ఉచిత ప్రయాణంతో పాటు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. అన్ని వర్గాల ప్రయాణీకులను ఆకట్టుకునేలా టీఎస్ ఆర్టీసీ వినూత్న చర్యలు చేపడుతుంది. ఈ ఆఫర్లపై ప్రయాణీకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News