వనమా రాజకీయ జీవితానికి కోలుకోలేని దెబ్బ.. వనమా రాఘవ లాంటివాళ్ళు చాలామంది ఉన్నారంటూ ప్రచారం

TRS Leaders: గులాబీ పార్టీతో సన్ స్ట్రోక్ తగిలి ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు..?

Update: 2022-01-08 08:18 GMT

వనమా రాజకీయ జీవితానికి కోలుకోలేని దెబ్బ.. వనమా రాఘవ లాంటివాళ్ళు చాలామంది ఉన్నారంటూ ప్రచారం

TRS Leaders: గులాబీ పార్టీతో సన్ స్ట్రోక్ తగిలి ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు..? పుత్రరత్నాల అరాచకాలు, ఆగడాలతో పలువురు ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందా? తనయుల భాగోతాలతో ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని భయపడుతున్నారా..?

తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే కాక మీదున్నాయి. పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగేలా గులాబీ పార్టీని సరికొత్త తలనొప్పులు వేధిస్తున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేల తనయులు చేస్తున్న పనులు పార్టీ పరంగా ఇబ్బందుల్ని తెస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండే వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటే అటువంటి నేతలు కొంతమంది సన్ స్ట్రోక్‌తో విలవిల్లాడుతున్నారట. తనయుల కారణంగా తమ రాజకీయ జీవితానికి మచ్చలు పడుతుండటంతో రానున్న ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అనే ఆందోళనలో వారున్నారని తెలంగాణ భవన్‌లో చర్చించుకుంటున్నారు.

కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో జరిగిన కుటుంబం ఆత్మహత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు పేరు తెరపైకి రావడంతో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది. దీనిపై విపక్షాలు, అనేక ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. చివరకు వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడిని నియోజక వర్గంలోకి రానీయనని చెప్పుకోవాల్సి వచ్చింది. 45 సంవత్సరాల వనమా రాజకీయ జీవితంలో కొలుకోలేని దెబ్బగా జిల్లా నేతలు చెబుతున్నారు. ఓవైపు ఆరోగ్యం సహకరించని పరిస్థితి మరోవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే బెంగ ఆయన అనుచర వర్గాలను పీడిస్తోంది. తనకు రాజకీయ వారసుడు అవుతాడనుకున్న కొడుకు నిర్వాకం అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడితో టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ వనమా కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు వచ్చే ఎన్నికలనాటికి తమ వారసుల్ని రాజకీయంగా తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక నియోజకవర్గాల్లో తనయుల వ్యవహారాలు తండ్రులకు తలబొప్పి కట్టిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి మరోవైపు తమ స్వీయ తప్పిదాలతో పుత్రరత్నాలు చేస్తున్నపనులు వారి ఇమేజికి డ్యామేజ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అయితే ఆయనకు తమ వారసులను అండగా నిలపాలని ప్రయత్నిస్తున్న నేతలకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగులుతోంది. వారు చేస్తున్న తప్పిదాలు అసెంబ్లీ గడప తొక్కకుండా చేసేలా ఉన్నాయని నాయకులు ఆందోళన చెందుతున్నారు.

వనమా వెంకటేశ్వరరావు ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమై అటు వనమాకు, ఇటు టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగేలా పరిణామాలు మారుతున్నాయి. ఇలాంటి వారసులు ఇంకా చాలామందే ఉన్నారని అంటున్నారు. కుమారులకు బాధ్యతలు అప్పగించి రిటైర్‌ అవుదామనుకుంటున్న తరుణంలో వారసులు చేస్తున్న తప్పుడు పనులు రాజకీయ భవిష్యత్‌కే ప్రమాదం తెచ్చేలా ఉన్నాయని సీనియర్‌ నాయకులు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News