జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం తెచ్చేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు

Update: 2020-10-01 05:29 GMT

ఎన్నికలకు ముందే గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త చట్టం రానుందా పంచాయతీరాజ్, పురపాలక తరహాలోనే జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన చట్టాన్ని జీహెచ్ఎంసీ కోసం కూడా రూపొందించనున్నారా నూతన చట్టం ఆధారంగానే కొత్త పాలకమండలి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందా ఇప్పుడే ఎందుకు కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం బావిస్తోంది. బల్దియా ప్రత్యేక చట్టానికి కొత్త మెరుగులు దిద్దుతారా ?

గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు బల్దియాలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్‌ మరింత మంచి పాలన అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నికలకు ముందే కొత్త చట్టం తేవాలని భావిస్తున్నారు. పారదర్శకతే లక్ష్యంగా ఈ చట్టం రాబోతుంది.

రాష్ట్రంలో స్థానికసంస్థల పరిపాలన పూర్తి పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం పంచాయతీరాజ్, పురపాలక చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. బాధ్యతల్లో తీసుకొచ్చిన మార్పులు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జీహెచ్‌ఎంసీలోనూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు మంత్రి కేటీఆర్‌. మున్సిపల్‌చట్టం తీసుకువచ్చిన సందర్భంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త పాలకమండలి నూతన చట్టంలో బాధ్యతలు నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్దలతో దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా నిబంధనలను పొందుపరిచి చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్‌. లేదంటే ఆర్డినెన్స్ ద్వారా కూడా చట్టాన్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News