Basara Vasant Panchami 2026: బాసరలో వసంత పంచమి వేడుకలు: క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

Basara: చదువుల తల్లి కొలువుదీరిన నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం వసంత పంచమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Update: 2026-01-23 06:24 GMT

Basara Vasant Panchami 2026: చదువుల తల్లి కొలువుదీరిన నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం వసంత పంచమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుక్రవారం పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలు వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున 1:30 గంటలకే ఆలయ తలుపులు తెరిచి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వేకువజామునే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిన్నారుల అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనే నమ్మకంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్షరాభ్యాస మండపాల్లో వేలాది మంది చిన్నారులకు అర్చకులు ఓంకార నాదం చేయించి అక్షర దీక్షనిచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ అంజనాదేవి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం తరఫున పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. భద్రతా పరంగా సీఐ కిరణ్, ఎస్సై నవనీత్ రెడ్డి పర్యవేక్షణలో భారీగా పోలీసులను మోహరించారు.

Tags:    

Similar News