New Vehicle Registration Rules: తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు.. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్.. నేరుగా ఇంటికే ఆర్‌సీ కార్డు!

New Vehicle Registration Rules: తెలంగాణలో కొత్త వాహనాలు కొనేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

Update: 2026-01-24 06:06 GMT

New Vehicle Registration Rules: తెలంగాణలో కొత్త వాహనాలు కొనేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ, ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 'డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్' విధానాన్ని శనివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వాహనం కొన్న షోరూమ్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) ప్రక్రియ పూర్తవుతుంది.

కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?

వాహనదారుల సౌలభ్యం కోసం రవాణా శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. శుక్రవారం మాదాపూర్‌లోని ఓ షోరూమ్‌లో దీనిని విజయవంతంగా పరీక్షించిన అనంతరం అధికారులు అధికారికంగా ప్రారంభించారు.

వాహనం కొనుగోలు చేయగానే, డీలరే నేరుగా ఆన్‌లైన్‌లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన పత్రాలను ఆర్టీఓ అధికారులు ఆన్‌లైన్‌లోనే పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తారు. ఉదయం వాహనం కొంటే సాయంత్రంలోపు, సాయంత్రం కొంటే మరుసటి రోజు ఉదయం కల్లా రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ కార్డు (RC) స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా వాహనదారుడి ఇంటి చిరునామాకు చేరుతుంది.

ముఖ్య గమనిక:

ఈ కొత్త విధానం కేవలం వ్యక్తిగత వినియోగ వాహనాలకు (బైక్‌లు, కార్లు) మాత్రమే వర్తిస్తుంది. ట్యాక్సీలు, లారీలు వంటి వాణిజ్య (Transport) వాహనాలు కొనేవారు మాత్రం యథావిధిగా ఆర్టీఓ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పారదర్శకతను పర్యవేక్షించేందుకు షోరూమ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News