Bandi Sanjay: సిట్ విచారణ ఓ టీవీ సీరియల్.. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ తీరు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Sanjay: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Bandi Sanjay: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కేసు దర్యాప్తు తీరు ఓ అంతులేని టీవీ సీరియల్‌లా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కేంద్రంగా అక్రమంగా ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. "దొంగే దొంగ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం ఉంది. ఆయన చేసిన దారుణాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశ భద్రత కోసం చేసే ట్యాపింగ్‌కు, స్వప్రయోజనాల కోసం తెలంగాణలో చేసిన అక్రమ ట్యాపింగ్‌కు అస్సలు సంబంధమే లేదు" అని ఆయన మండిపడ్డారు. మావోయిస్టుల నిఘా పేరుతో నటీనటులు, వ్యాపారులు, రాజకీయ నేతలు, చివరకు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ధ్వజమెత్తారు.
సిట్ అధికారులపై తనకు నమ్మకం ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారికి స్వేచ్ఛనివ్వడం లేదని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, అందుకే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లుగా విచారణ సాగుతున్నా ఇప్పటివరకు ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉండి ఉంటే, ఇప్పటికే కేసీఆర్ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. సిట్ విచారణ అనేది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని, తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారిని, నేతను వెంటనే కటకటాల్లోకి నెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.