Kavitha : వెలుగుమట్ల బాధితుల కోసం దీక్ష.. కవితతో పాటు 33 మందిపై కేసు నమోదు

Kavitha : ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో 33 మందిపై కేసులు నమోదు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Update: 2026-03-10 02:24 GMT

Kavitha Arrest

Kavitha : ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా నిరాహార దీక్షకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ అరెస్టు పర్వం కొనసాగింది. కవితతో పాటు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, మరికొందరు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపేది లేదని, అరెస్టు చేసినా దీక్షను కొనసాగిస్తానని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అర్ధరాత్రి హైడ్రామా

వెలుగుమట్ల భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను గత నెల 24న ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించింది. అప్పటి నుంచి ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. సోమవారం ఖమ్మం చేరుకున్న కవిత, బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దాదాపు నాలుగున్నర గంటల పాటు ధర్నా చేశారు. పోలీసులు ఆమెను వారించినా, రాత్రి పునరావాస కేంద్రంలోనే నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఖమ్మం సీపీ, సుమారు 600 మంది పోలీసులతో దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి, తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కవితను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.

పోలీసుల యాక్షన్.. 34 మందిపై కేసులు

కవిత అరెస్టు సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిన్న రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో కవిత సహా మరో 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితులకు గతంలో ఇళ్లు కూల్చేసిన చోటే మళ్ళీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు బాధితుల పక్షాన నిలబడతామని ఆమె తేల్చి చెప్పారు.

రాజకీయంగా మారుతున్న వెలుగుమట్ల ఇష్యూ

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు బాధితులను పరామర్శించగా, కవిత రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పేదల ఇళ్లను కూల్చివేసిందని విపక్షాలు విమర్శిస్తుండగా, అది ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు. తాజాగా కవిత అరెస్టుతో ఖమ్మంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగులుతుండటం ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News