Yadadri Bhuvanagiri: ప్రేమ విఫలమైందని తనువు చాలించిన యువతి.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Yadadri Bhuvanagiri: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
Yadadri Bhuvanagiri: ప్రేమ విఫలమైందని తనువు చాలించిన యువతి.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Yadadri Bhuvanagiri: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రేమ పేరుతో మోసం..
పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో, ఇటీవల మమత తనను పెళ్లి చేసుకోవాలని మత్స్యగిరిని కోరింది. అయితే, అందుకు అతను నిరాకరించడమే కాకుండా ఆమెను దూరం పెట్టాడు. తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడనే బాధతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది.
సోదరికి ఫోన్ చేసి కడసారి వీడ్కోలు..
ఆదివారం మమత తల్లిదండ్రులు పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. సోదరి భవాని వ్యవసాయ బావి వద్దకు వెళ్లడంతో ఇంట్లో మమత ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పింది. ఆందోళనతో భవాని వెంటనే ఇంటికి పరుగులు తీసింది. అయితే అప్పటికే మమత తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. తాను ప్రేమించిన వ్యక్తి తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టింది.
పోలీసుల దర్యాప్తు:
సమాచారం అందుకున్న వలిగొండ ఎస్‌ఐ యుగంధర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మమత సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మత్స్యగిరి పాత్రపై దర్యాప్తు చేపడుతున్నారు.