Phone Tapping Case: కేటీఆర్, రాధాకిషన్‌రావు ముఖాముఖి విచారణ.. సిట్ ప్రశ్నల వర్షం!
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక ఘట్టం చోటుచేసుకుంది.
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్ (SIT) అధికారులు విచారిస్తున్నారు. అయితే, ఈ విచారణలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను అధికారులు విచారిస్తుండటం.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో వీరిద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను, కేటీఆర్ చెబుతున్న సమాధానాలను అధికారులు సరిపోల్చుతున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.
గత విచారణల్లో రాధాకిషన్‌రావు సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టామని, అప్పటి ప్రభుత్వంలోని కొందరు కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే, ఆ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లపై నిఘా ఉంచడం.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎవరికి చేరవేసేవారు అనే అంశాలపై అధికారులు స్పష్టత కోరుతున్నారు. గంటల తరబడి సాగుతున్న ఈ విచారణలో కేటీఆర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసు తదుపరి మలుపు తిరగనుంది. పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత నడుమ ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.