Phone Tapping Case: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది.
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ఉదయం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి ఆయన చేరుకోగా, అధికారులు విచారణను ప్రారంభించారు.
తెలంగాణ భవన్ నుంచి భారీ ర్యాలీగా.. సిట్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను తెరపైకి తెస్తోందని ఆయన విమర్శించారు. అనంతరం అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయలుదేరారు. కేటీఆర్‌కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు పలువురు ముఖ్య నేతలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.
పోలీసుల భారీ బందోబస్తు కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే రహదారులపై ఆంక్షలు విధించారు. సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నవళితో కేటీఆర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో గతంలో అరెస్టయిన అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.