Rythu Bharosa : తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఈ నెలాఖరున అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. మొత్తం రూ.9,000 కోట్లను రెండు విడతల్లో (మార్చి, ఏప్రిల్) రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు.
Rythu Bharosa
Rythu Bharosa : తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొన్ని నెలలుగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. యాసంగి సీజన్ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి వివేక్, ఈ పథకం అమలు తీరును వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.9,000 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. అయితే, ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ మార్చి నెలాఖరులోగా తొలి విడత కింద రూ.4,500 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. మిగిలిన రూ.4,500 కోట్లను వచ్చే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నిజానికి జనవరిలోనే ఈ నిధులు విడుదల కావాల్సి ఉండగా, రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, పోలింగ్ ప్రక్రియ ముగియగానే నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.9,000 కోట్ల రుణాన్ని సేకరించే ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా ఈ నిధులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
రైతు భరోసాతో పాటు సన్న బియ్యం పండించే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ పైనా మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 92 శాతం మంది రైతులకు బోనస్ సొమ్మును విజయవంతంగా అందజేశామని వివేక్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాలను మార్కెట్ కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.